Begin typing your search above and press return to search.

కేసీఆర్ కేబినెట్ కొలిక్కి... చివ‌రి ట్విస్ట్ మిగిలింది

By:  Tupaki Desk   |   7 Feb 2019 6:13 AM GMT
కేసీఆర్ కేబినెట్ కొలిక్కి... చివ‌రి ట్విస్ట్ మిగిలింది
X
గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ట్విస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఫిబ్ర‌వ‌రి తొలివారంలోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని భావించిన‌ప్ప‌టికీ....ఆ స‌మ‌యం గ‌డిచిపోవ‌డంతో....ఆశావహుల్లో ఆందోళ‌న నెల‌కొంది. మ‌రోవైపు గులాబీ ద‌ళ‌ప‌తి క‌స‌రత్తు కొలిక్కి వ‌చ్చింద‌ని స‌మాచారం. రాబోయే ఒక‌ట్రెండు రోజుల్లో, ఈ ప్ర‌క్రియ పూర్తి కానున్న‌ట్లు చెప్తున్నారు. అయితే, ఇందులోనూ కేసీఆర్ ట్విస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది.

కేసీఆర్ క‌స‌ర‌త్తు గురించి తెలిసిన వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, కొత్త కేబినెట్ లెక్క మారింది. ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్‌ తో పాటు హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రస్తుతం పనిచేస్తున్నారు. మరో పదమూడు మందిని తీసుకుంటే కేసీఆర్‌ అదృష్ట సంఖ్య (6) కుదురుతుంది. ఇప్పుడున్న ఇద్దరికి తోడు 13 కలిపితే మొత్తం 15 (1ప్లస్5=6)కి చేరుతుందని లోక్‌ సభ ఎన్నికల తర్వాత మిగతా మూడు ఖాళీలను భర్తీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత మంత్రివర్గంలో అమాత్యులుగా పనిచేసిన వారిలో కొంతమందికే తిరిగి పదవులు దక్కవచ్చని చెబుతున్నారు. మంత్రివర్గ కూర్పుపై సీఎం కేసీఆర్‌ ఆయన తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు బుధవారం బాగా పొద్దుపోయేంత వరకు సమాలోచనలు జరిపినట్టు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్న కేటీఆర్‌ మంత్రుల జాబితా తయారీలో తండ్రి కేసీఆర్‌ కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్టు సమాచారం.

పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, ఓసీ, బీసీ, ఎస్సీ సామాజిక‌వ‌ర్గాల వారీగా కేసీఆర్ లెక్క చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా డిప్యూటీ స్పీక‌ర్‌, మ‌హిళా మంత్రిపై క‌స‌ర‌త్తు సాగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఒక‌ట్రెండు రోజుల్లో ఇది స్ప‌ష్ట‌త‌కు రానున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన దాదాపుగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప‌రిమిత సంఖ్య‌లో మంత్రులను నియ‌మించుకొని పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌ర్వాత మంత్రివ‌ర్గం పూర్తి స్థాయిలో విస్త‌రించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. తొలిద‌శ‌లో ఎంద‌రిని నియ‌మించుకోవాల‌నే అంశంపై కేసీఆర్ ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.