Begin typing your search above and press return to search.

గోదారమ్మ వింటోంది షెకావత్ సారూ...?

By:  Tupaki Desk   |   5 March 2022 11:36 AM GMT
గోదారమ్మ వింటోంది షెకావత్ సారూ...?
X
గోదారమ్మకు ఏమీ తెలియదు అనుకుంటే తప్పే. అది మూడు రాష్ట్రాలను దాటుకుని వస్తోంది. అన్ని మాటలూ దానికి తెలుసు. అన్ని రకాల రాజకీయమూ దానికి ఎరుకే. ఇదిలా ఉంటే గోదారమ్మను పోలవరం గురించి అడిగితే దాని ప్రస్థానం ఎక్కడ నుంచి అన్నది చెబుతున్నారు 1940 నాటి ఈ ప్రతిపాదన ఈ రోజుకూ పరిపూర్తి కాకుండా ఉందనే గోదారమ్మ నిశ్శబ్దంగా ఉంటోంది. చేసేదేమీ లేక గంభీర సాగరం వైపుగా పరుగులు పెడుతోంది.

ఇంతకీ గోదారమ్మ ఆశలేంటి అంటే జీవజలాలతో ఏపీని సస్యశ్యామలం చేయాలని. అన్నపూర్ణగా ఏపీని మార్చాలని. అందుకోసం పోలవరం కట్టమంటోంది. మరి కేంద్రంలోని పాలకులు అయితే ఈ విషయంలో మందగమనంతోనే ఉన్నారు. ఎటూ తేల్చకుండా ఉన్నారు. పోలవరానికి ఇప్పటికి నాలుగేళ్ల క్రితం సవరించిన అంచనాల ప్రకారం 55,,548 కోట్ల రూపాయలు అంచనా వేశారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ అన్ని ధరలూ పెరిగిపోయాయి. కచ్చితంగా ఆలోచిస్తే మరో పది వేల కోట్లు అదనపు భారం పడే సీన్ అయితే ఉంది.

కానీ ఈ సవరించిన మొత్తానికే దిక్కు లేదు. దీని మీద ఎన్ని కొర్రీలు వేయాలో అన్నీ వేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికి నికరంగా పోలవరం జాతీయ ప్రాజెక్టునకు కేంద్రం ఇచ్చినది పదకొండు వేల కోట్లు మించినది లేదు. అంటే 55 వేల కోట్లలో ఇది కేవలం 20 శాతం మాత్రమే. అది కూడా ఎనిమిదేళ్లలో ఇచ్చిన మొత్తం. మరి మిగిలిన ఎనభై శాతం నిజంగా ఇస్తారనుకున్నా దానికి ఎంతకాలం పడుతుందో లెక్కలు తెలిసిన అయిదవ తరగతి విద్యార్ధిని అడిగినా ఇట్టే చెప్పేస్తాడు.

ఇవన్నీ ఇలా ఉంటే పోలవరానికి సంబంధిచి ప్రతీ పైసా మేమే ఇస్తామని గొప్పగా కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. మీరు బిల్లులు అన్నీ పంపండి మేము ఇవ్వకుండా ఉంటామా అని కూడా డబాయిస్తారు. మరి బిల్లులు పంపిస్తే వాటిని పట్టుకుని తిప్పి పంపుతారు. లేకపోతే కొర్రీలు వేసి పంపుతారు. ఇక సవరించిన అంచనాల విషయంలో కూడా మాకు లెక్కలు పంపలేదు అనే కేంద్ర పెద్దలు అంటున్నారు

దీని మీద అధికారుల స్థాయిలో ఎన్నో సార్లు మీటింగులు జరిగాయి. సమీక్షలు చేశారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కానీ, ఇతర ఎంపీలు కానీ ఢిల్లీ వెళ్ళి అన్నీ అడిగి వచ్చారు. కానీ చిత్రమేంటి అంటే ఈ రోజుకు కూడా కేంద్రం నుంచి 55 వేల కోట్ల అంచనాలకు కచ్చితమైన హామీ అయితే దక్కలేదు.

మరి ఆ సంగతి పక్కన పెట్టేసి పోలవరాన్ని మేము చూసుకుంటామని కేంద్ర మంత్రులు చెబితే నమ్మదగిన విధంగా ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది. ఇక కేంద్రం అయితే పోలవరం జాతీయ ప్రాజెక్ట్, క్రెడిట్ మాదే అంతా మాదే అంటోంది. మరి అలాంటిది ఏపీ మీద ఖర్చుల భారం ఎందుకు వేయడం, ముందు మీరు ఖర్చు చేయండి మేము ఆనక నిధులు ఇస్తామని చెప్పడం ఎందుకు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

మరో వైపు చూస్తే ఏపీ సర్కార్ పెట్టిన ఖర్చునకు కూడా ఎప్పటికపుడు నిధులు ఇవ్వడంలేదు. అలా బకాయిలు పెండింగులో ఉన్నాయి. దీనిమీదనే వైసీపీ సర్కార్ పెద్దలు ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించండి అని కూడా అడిగారు. దాని మీద కూడా కేంద్ర మంత్రి నుంచి హామీ ఏదీ వచ్చింది లేదు.

మొత్తానికి పోలవరం మీద ఫోకస్ పెట్టామని చెప్పుకోవడానికి అయితే కేంద్ర మంత్రి వచ్చారు. అంతే కాదు, ప్రతీ పదిహేను రోజులకు ఒక సారి రివ్యూ ఉంటుందని, మూడు నెలలకు ఒకసారి తానే స్వయంగా వచ్చి పోలవరం పనులను వ్యక్తిగతంగా సమీక్షిస్తామని కూడా షెకావత్ చెప్పారు. అంత వరకూ అయితే సంతోషం. అదే టైమ్ లో సవరించిన అంచనాలను ఆమోదిస్తేనే తప్ప పోలవరానికి ముక్తీ మోక్షమ‌న్నవి దక్కవు. మరి ఆ పని షెకావత్ చేస్తారా. లేక మరో మూడు నెలల తరువాత వచ్చినపుడు కూడా ఇదే చెబుతారా. ఏమో చూడాలి.