Begin typing your search above and press return to search.

హిజాబ్ వివాదం పై హైకోర్టు సంచలన తీర్పు..

By:  Tupaki Desk   |   15 March 2022 6:09 AM GMT
హిజాబ్ వివాదం పై హైకోర్టు సంచలన తీర్పు..
X
కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన ‘హిజాబ్’ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించరాదనే వివాదంపై తాజాగా తుది తీర్పునిచ్చింది. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల్లో మతపరమైన ఆచారాలను పాటించడం తప్పనిసరి కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు ఈ అంశంపై దాఖలైన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల ప్రొటోకాల్ ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

మరోవైపు హైకోర్టు తీర్పుపై పిటీషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై గతనెల కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కర్ణాటకతోపాటు దేశమంతా ఇది విస్తరించింది. హిజాబ్ కు మద్దతుగా.. వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. మరోవైపు హిజాబ్ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు.

తొలుత జస్టిస్ కృష్ణదీక్షిత్ తో ఏర్పాటైన ఏకసభ్య ధర్మాసనం విచారించింది. ఆ తర్వాత ఈ విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనిపై ఫిబ్రవరి 10న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది 15 రోజుల పాటు వాదనలు వినింది. ఇదే సమయంలో సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ లో పెట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే నేడు బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. నేటి నుంచి మార్చి 19 వరకూ ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఉడుపిలో స్కూళ్లు, పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.