Begin typing your search above and press return to search.

ప‌ద‌వుల్లేవ్ కానీ పార్టీ ప‌నులున్నాయ్ !

By:  Tupaki Desk   |   1 April 2022 4:26 AM GMT
ప‌ద‌వుల్లేవ్ కానీ పార్టీ ప‌నులున్నాయ్ !
X
చాలా కాలం త‌రువాత పార్టీ ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి అన్న ఆలోచ‌న‌కు వ‌చ్చారు. ఓ విధంగా ఇంత వ‌ర‌కూ ఇళ్ల‌కే ప‌రిమితం అయిన మంత్రులు మ‌రియు ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు ఇప్పుడు ప‌రుగులు తీయాల్సిందే! ముఖ్య‌మంత్రి కొంద‌రికి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు అప్ప‌గిస్తారు. వాటిని గెలిపించుకుని వ‌స్తేనే మంత్రి ప‌దవి వ‌చ్చే టెర్మ్ లో ఉంటుంది లేదంటే వారిని పూర్తిగా పార్టీకీ, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌కూ దూరంగా ఉంచుతారు. మొన్న‌టి వేళ చెప్పిన విధంగా ఇదొక నిరంతర ప్ర‌క్రియ. బీసీ ఓట్లు అన్న‌వి ఎక్కువ‌గా చీలి పోకుండా ఉండేందుకు ముందునుంచే కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని తీరాల‌ని అనుకుంటున్నారు. ఎలానూ టీడీపీ ఓ విధంగా బీసీల పార్టీగా పేరు తెచ్చుకుంది.

మ‌రో పార్టీ జ‌న‌సేన కూడా అట్ట‌డుగు వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇస్తోంది. వీరిద్ద‌రూ క‌లిస్తే త‌మ‌కు ఇబ్బందే క‌నుక ఇప్ప‌టి నుంచి స్థానిక బీసీ నాయ‌క‌త్వాల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు కొన్ని ముఖ్య కార్పొరేష‌న్ల చైర్మ‌న్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నిధులు ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేదు. ఎమ్మెల్యేలకు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కింద రెండు కోట్లు ఇవ్వాల‌ని అనుకున్న విధంగానే, వివిధ కార్పొరేష‌న్ల అభివృద్ధికి జ‌గ‌న్ నిధులు ఎంతో కొంత విడుద‌ల చేసి ప్రాధాన్య క్ర‌మంలో సంబంధిత చైర్మ‌న్ల‌తో ఆయా కుల సంఘాలతో స‌మావేశాలు ఏర్పాటు చేసి, త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొందాలని అనుకుంటున్నారు.

అదేవిధంగా ఎంఆర్పీస్ లీడ‌ర్ మంద‌కృష్ణ మాదిగ లాంటి లీడ‌ర్ల సాయం కూడా జ‌గ‌న్ త్వ‌ర‌లో తీసుకోనున్నార‌ని సమాచారం. ద‌ళిత ఓటు బ్యాంకు ను కూడా త‌మ‌కు అనుగుణంగా తిప్పుకునేందుకు జూపుడి లాంటి లీడ‌ర్లు మ‌ళ్లీ మ‌ళ్లీ సీన్లోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

ఉగాది త‌రువాత అంతా అపురూపం అనుకునే మ‌రో ఘ‌ట్టం ఆవిష్క‌ర‌ణ‌కు సీఎం సిద్ధం అవుతున్నారు.అదే త‌న క్యాబినెట్ లో మార్పులు మ‌రియు చేర్పులు. ఓ విధంగా జ‌గ‌న్ 2.0 వెర్ష‌న్ కు ఆయ‌న అప్టేడ్ అవుతున్నారు. ఇందుకోసం చాలా శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. జిల్లాల వారిగా ఇప్ప‌టిదాకా ప‌ద‌వులు అనుభ‌వించిన మంత్రులను త‌ప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు.

రానున్న రెండేళ్ల కాలం త‌న‌కు ఎంతో క్రియాశీల‌కం క‌నుక ఆ విధంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. చాలా మంది సీనియ‌ర్ల‌ను పార్టీ ప‌నుల‌కు ప‌రిమితం చేయాల‌ని త‌ద్వారా త‌న గెలుపు గుర్రాల ఎంపిక‌కు మార్గం సుగ‌మం అవుతుంద‌ని కూడా అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఉగాది నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైఎస్సార్సీపీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని పూనుకున్నారు.

మ‌రోవైపు సీనియ‌ర్ల‌తో పాటు బీసీ మంత్రులు చాలా మంది ఇంటికే వెళ్ల‌నున్నారు. చెల్లుబోయిన వేణు, సీదిరి అప్ప‌ల్రాజు లాంటి వారంతా ఇంటికే వెళ్ల‌నున్నారు.అదేవిధంగా డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ‌వాణి, మ‌రో డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాసు,అదేవిధంగా ఆళ్ల‌నాని ఇంటికే ప‌రిమితం కానున్నారు. ఇందులో బీసీ మంత్రుల‌కు ప్ర‌చార ప‌నులు అప్ప‌గించేందుకు సిద్ధం అవుతున్నారు.త్వ‌ర‌లో పార్టీ కి సంబంధించి బాధ్య‌త‌లు వీరికి అప్ప‌గిస్తారు వాటితో పాటే బీసీ చైత‌న్య యాత్ర‌ల రూప‌క‌ల్ప‌న‌కు ప్లాన్ చేస్తున్నారు. వీటి వ్య‌వ‌హారాల‌కు సంబంధించి ఒక ప్ర‌ణాళిక సిద్ధం అయి ఉంద‌ని తెలుస్తోంది.