Begin typing your search above and press return to search.

కరోనా బాధితులను వెంటాడుతున్న కొత్త సమస్యలు.. జాగ్రత్తగా ఉండాల్సిందే..!

By:  Tupaki Desk   |   26 March 2022 9:30 AM GMT
కరోనా బాధితులను వెంటాడుతున్న కొత్త సమస్యలు.. జాగ్రత్తగా ఉండాల్సిందే..!
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్న కరోనా గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టినప్పటికీ... మరోసారి నాలుగో వేవ్ తో విజృంభిస్తోంది. అయితే చైనా లాంటి కొన్ని దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైరస్ విస్తృతి పై అలసత్వం వహించకూడదని ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే కొవిడ్ బాధితులు వెంటనే కోలుకుంటున్నప్పటికీ లక్షణాలు మాత్రం చాలా కాలం పాటు వీడడం లేదు. ఇలాంటి లక్షణాలను లాంగ్ కొవిడ్ లక్షణాలుగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రధానంగా కొవిడ్ బాధితుల్లో రెండు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి జ్ఞాపకశక్తి సమస్యలు. రెండోది ఏకాగ్రత లేకపోవడం. దాదాపు 70 శాతం మంది కరోనా బాధితులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఈ సమస్యలు ఇలాగే కొనసాగుతున్నాయి. అయితే లాంగ్ కొవిడ్ ప్రభావాలను తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు.

లాంగ్ కొవిడ్ బాధితుల్లో ఎక్కుగా మెమెరీ సమస్యలు , ఏకాగ్రత లోపించడం వంటివి వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రతి పది మంది కొవిడ్ బాధితుల్లో ఏడుగురు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వివరించారు. అంతే కాకుండా ఈ లక్షణాలు శాశ్వతంగా లేదా ఏడాది వరకూ ఉంటున్నట్లు కేంబ్రిడ్జి నిపుణులు పేర్కొన్నారు. వీటితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, ఛాతి నొప్పి, దగ్గు, నిద్రలేమి, ఆత్రుత, ఒళ్ల జలదరించడం వంటి దీర్ఘకాళిక సమస్యలు ఎక్కువగా బాధిస్తున్నాయట.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా బలహీనత, జలుబు, దగ్గు ఉంటే అది లాంగ్ కొవిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం అనారోగ్యంగా ఉండటం వల్ల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది గుండె, మూత్ర పిండాలు, మెదడుపై ప్రభావం చూపుతుంది. వాసన లేకపోవడం. ఆకలిగా అనిపించకపోయినా కరోనా బాధితులు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే అతిసారం, జీర్ణక్రియ సమస్య కూడా కరోనా వల్ల ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే జాగ్రత్తలు తప్పనిసరి.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏం పర్వాలేదులే అని వేచి చూడకుండా కచ్చితంగా వైద్యుడి వద్దకు వెళ్లాలి. కరోనా తగ్గినా లాంగ్ కొవిడ్ కి చికిత్స తీసుకోవాలి. అంతే కాకుండా ఎక్కువగా జనాలతో కలవకుండా ఒంటరింగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే వారు కూడా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

కరోనా నాలుగో వేవ్ వస్తున్నందున లాంగ్ కొవిడ్ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలతో బాధ పడే వారికి మరో సారి కరోనా వస్తే ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అందుకే కరోనా బాధితుల్లో సమస్యలున్న వారు కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ లను కూడా తీసుకోవాలి.