Begin typing your search above and press return to search.

ఫినిషింగే కాదు.. షాకులివ్వడంలోనూ ధోనీని మించినవారు లేరు.. సీఎస్కే కెప్టెన్సీకి రాజీనామా

By:  Tupaki Desk   |   24 March 2022 1:49 PM GMT
ఫినిషింగే కాదు.. షాకులివ్వడంలోనూ ధోనీని మించినవారు లేరు.. సీఎస్కే కెప్టెన్సీకి రాజీనామా
X
మహేంద్ర సింగ్ ధోని.. మ్యాచ్ ఫినిషిర్ గా ఎంతగానో లబ్ధ ప్రతిష్ఠుడు. జట్టు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. లక్ష్యం ఎంత పెద్దదైనా.. అతడి మనో నిబ్బరం ముందు దిగదుడుపే.. అలానే ఆడి 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్ లు గెలిపించాడు. 2004 నుంచి 2019 వరకు అతడు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సందర్భాల్లో ఎన్నో సంక్షోభాలు ఎదురైనా చెక్కుచెదరకుండా అత్యంత సమస్యాత్మక పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నాడు.

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గానూ నిలిచాడు. ధోని సారథ్యంలో అరంగేట్రం చేసినవారెందరో గొప్ప క్రికెటర్లుగానూ ఎదిగారు. అలాంటి ధోని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను నాలుగుసార్లు లీగ్ విజేతగా నిలిపాడు. అంతేకాదు.. లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే అది సీఎస్కేనే. మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో దాదాపు 65 శాతం విజయాలతో దుమ్మురేపింది సీఎస్కే. 2016, 2017లో మాత్రం ఫిక్సింగ్ కారణంగా.. లీగ్ లో పుణె సూపర్ జెయింట్స్ గా ఆడింది.

11 సార్లు ప్లే ఆఫ్స్ కుచేరింది. 9 సార్లు ఫైనల్స్ ఆడింది. నాలుగు సార్లు చాంపియన్ గా, ఐదుసార్లు రన్నరప్ గా మిగిలింది.మొదటినుంచి ధోనినే సారథిచెన్నై సూపర్ కింగ్స్ విజయ ప్రస్థానంలో మొదటి నుంచి ధోనినే సారథి. 2008లో లీగ్ తొలి ప్రారంభంకాంగా.. మహీ సారథ్యంలోని సీఎస్కే రన్నరప్ గా నిలిచింది. 2010, 2011, 2018, 2021లో విజేత సీఎస్కేనే. 2012, 2013, 2015,2015లో చెన్నైకు కప్ చేజారింది. 2020 లో మాత్రమే చెన్నై అత్యంత దారుణ ప్రదర్శన చేసింది. మిగతా అన్నిసార్లు అభిమానులను అలరించింది.

అయితే, తొలి నుంచి కెప్టెన్ గా ఉంటూ వస్తున్న మహేంద్ర సింగ్ ధోని.. గురువారం అకస్మాత్తుగా తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. అలా.. ఐపీఎల్‌-2022 సీజన్‌ ప్రారంభానికి ముందు అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఆల్ రౌండర్‌ రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు అప్పగించాడు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. 2012 నుంచి జడేజా చెన్నై జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ అతడే.

ధోని ఎప్పుడూ అంతే..90 టెస్టులాడిన క్రికెటర్ వంద టెస్టులాడాలని అనుకుంటాడు. వంద టెస్టులు ఎవరికైనా గొప్ప కల. అదికూడా కెప్టెన్ గా ఉంటూ, ఆటగాడిగా జట్టులో సుస్థిర స్థానం ఉన్న ఆటగాడు.. ఫామ్ కోల్పోయినా వంద టెస్టుల తంతు ముగించేయాలనుకుంటాడు. కానీ, ధోనీ అలాకాదు.. తన 90 వ టెస్టు అనంతరం 2014 ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

అప్పుడూ ఇంతే..అకస్మాత్గుగా నిర్ణయం చెప్పాడు. 2019లో వన్డే ప్రపంచ కప్ తర్వాత టీమిండియా ఎంపికకు దూరంగా ఉన్న ధోని.. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. నాడు కూడా చడీ చప్పుడు లేకుండా ఓ సాయంత్రం వేళ ప్రకటన చేసి ఊరుకున్నాడు. మళ్లీ ఇప్పుడూ అంతే.. సరిగ్గా ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభానికి ముందు చెన్నై కెప్టెన్సీకి రాజీనామా చేసి తన రూటే సెపరేటు అని చాటాడు. అందుకే.. మ్యాచ్ లు ముగించడంలోనే కాదు రిటైర్మెంట్ ప్రకటించడంలోనూ ధోని స్టయిలే వేరు.