Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా.. మ‌రి తెలంగాణ‌లో..?

By:  Tupaki Desk   |   25 March 2022 2:30 AM GMT
క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా.. మ‌రి తెలంగాణ‌లో..?
X
కాంగ్రెస్ పార్టీ క‌ర్ణాట‌క‌లో ఒక స‌రికొత్త ఫార్ములా తీసుకురావాల‌ని యోచిస్తోందా..? దీని ద్వారా ఇరు వ‌ర్గాల గొడ‌వ‌ల‌ను స‌ద్దుమ‌ణిగించి పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్ట‌నుందా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా దూసుకుపోనుందా..? ఇక్క‌డ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా విజ‌య‌వంతం అయితే తెలంగాణ‌లో కూడా ప్ర‌యోగం చేయ‌నుందా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో అగ్ర‌నేత‌ల‌ మ‌ధ్య చాలా రోజుల నుంచి అగాథం నెల‌కొంది.

పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్‌, సీఎల్పీ నేత సిద్ధ‌రామ‌య్య‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు రోజురోజుకు మ‌లుపులు తిరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం పోరాడాల్సిన నాయ‌కులు వ‌ర్గ పోరుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఎవ‌రికి వారు త‌గ్గేదేలే అనేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ ఇద్ద‌రి అగ్ర‌నేత‌ల మ‌ధ్య పోరుతో శ్రేణులు అయోమ‌యంలో ప‌డిపోతున్నారు. ప‌రిస్థితి ఇలాగే ఉంటే ఏడాదిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో పార్టీకి ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని.. బీజేపీకి మ‌రోసారి అవ‌కాశం వ‌దులుకోవాల్సి ఉంటుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మేకెదాటు పాద‌యాత్ర‌లో అంతా క‌లిసిక‌ట్టుగా సాగినా అంత‌ర్గ‌త విభేదాలు మాత్రం చ‌ల్లార‌లేదు. క్రితం సారి సిద్ధూ ఆధ్వ‌ర్యంలో అధికారంలోకి రాలేక‌పోయినందుకే అధిష్ఠానం త‌న‌కు అధ్య‌క్ష ప‌ద‌వి అప్ప‌గించింద‌ని శివ కుమార్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌ను బాధ్య‌త‌లు తీసుకున్నాక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇమేజ్ బాగా పెరిగిపోయింద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి చెక్ పెట్టే స్థాయిలో శ్రేణుల్ని సిద్ధం చేశాన‌ని చెబుతున్నారు. సిద్ధూ వ‌ర్గం త‌న‌కు స‌హ‌క‌రించ‌క‌పోగా ప‌లురీతుల్లో అడ్డంకులు సృష్టిస్తోంద‌ని.. వెన్నుపోటు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే దీనిపై సిద్ధ‌రామ‌య్య వ‌ర్గం వాద‌న‌ మ‌రోలా ఉంది. రాష్ట్రంలో అహింద వ‌ర్గాన్ని బ‌లోపేతం చేసి కాంగ్రెస్ కు చేరువ చేశామ‌ని.. పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసిన త‌మ‌ను ప‌ట్టించుకోకుండా శివ కుమార్ వ‌ర్గం ప‌దేప‌దే అవ‌మానిస్తోంద‌ని వాపోతున్నారు. ఈ ఇరు వ‌ర్గాల గొడ‌వ‌ల్లో ఇప్ప‌టికే కాంగ్రెస్ నుంచి వ‌ల‌స‌లు వెల్లువెత్తాయి. ప‌లువురు సీనియ‌ర్లు బీజేపీ, జేడీఎస్ పార్టీల్లో చేరారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఇటీవ‌ల రాహుల్ గాంధీ పార్టీ నేత‌ల‌తో ఢిల్లీలో స‌మావేశ‌మ‌య్యారు. ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేయాల‌ని తేల్చి చెప్పారు. ప‌నిలోప‌నిగా రెండు వ‌ర్గాల ఆధిప‌త్య పోరుపై స‌మీక్షించారు. అయితే ఇక్క‌డ రాహుల్ గాంధీ ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌తిపాద‌న పెట్టార‌ట‌.

ఎన్నిక‌ల ముందు సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌బోమ‌ని చెప్పార‌ట‌. ఫ‌లితాలు అనుకూలంగా వ‌స్తే శివ కుమార్ కు, సిద్ధ రామ‌య్య‌కు చెరి రెండున్న‌ర సంవ‌త్స‌రాల కాలం సీఎం ప‌ద‌విని అప్ప‌గిస్తార‌ట‌. కేబినెట్ కూర్పు కూడా ఆ విధంగా మార్చుకునే అవ‌కాశం ఉంద‌ట‌. దీంతో ఇరు వ‌ర్గాలు ప్ర‌స్తుతానికైతే సంతృప్తి వ్య‌క్తం చేశాయ‌ట‌. అయితే ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కూడా ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తోంది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా క‌ర్ణాట‌క‌లో స‌క్సెస్ అయితే ఇక్క‌డ‌ కూడా అమ‌లు చేస్తార‌ని ఆశావ‌హులు భావిస్తున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!