Begin typing your search above and press return to search.

ఇదేనా రేవంత్ వ్యూహం.. ఒక్కొక్క‌రితో చెక్!

By:  Tupaki Desk   |   25 March 2022 12:30 AM GMT
ఇదేనా రేవంత్ వ్యూహం.. ఒక్కొక్క‌రితో చెక్!
X
ఏ నాయ‌కుడికైనా ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల నుంచి స‌వాలు త‌ప్ప‌దు. ఇక సొంత‌పార్టీలోనూ అస‌మ్మ‌తి వ‌ర్గం నుంచి అప్పుడ‌ప్పుడూ సెగ త‌గులుతూనే ఉంటుంది. ఆ అస‌మ్మ‌తి వ‌ర్గాన్ని చ‌ల్లార్చుకోవ‌డం కోసం ఒక్కొక్క‌రు ఒక్కోలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గేంచుందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ వ్యూహానికి తెర‌తీశాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆ అస‌మ్మ‌తి వ‌ర్గం నేత‌ల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌కు ఒక్కొక్క‌రిగా మ‌చ్చిక చేసుకుంటూ మిగ‌తా వాళ్ల‌కు చెక్ పెట్టేందుకు రేవంత్ సిద్ధ‌మ‌య్యార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు

ముందుగా కోమ‌టిరెడ్డి..టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అప్ప‌టి నుంచి రేవంత్‌పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ఆ ప‌ద‌వి రాక‌పోవ‌డంతో తీవ్ర అస‌హ‌నానికి గురై అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో జరిగే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు.

రేవంత్ రెడ్డిపై పరోక్ష విమర్శలు కొనసాగిస్తూ వచ్చారు. ఓ ద‌శ‌లో ప్రభుత్వ కార్య‌క్ర‌మాల్లో కేసీఆర్‌కు స‌న్నిహితంగా మెలిగారు. దీంతో ఆయ‌న టీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే చ‌ర్చ జ‌రిగింది. దీంతో ముందు కోమ‌టిరెడ్డిని మ‌చ్చిక చేసుకునేందుకు రేవంత్ రంగంలోకి దిగారు. ఆయ‌న‌కు పార్టీలో త‌గిన ప్రాధాన్య‌త క‌చ్చితంగా ఉంటుంద‌నే హామీనిచ్చి వెంక‌ట్‌రెడ్డిని కూల్ చేశార‌ని అంటున్నారు.

ఇప్పుడు క‌లిసిపోయి..రేవంత్‌రెడ్డితో చ‌ర్చ త‌ర్వాత వెంక‌ట్‌రెడ్డి వెన‌క్కి త‌గ్గార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్పుడు రేవంత్‌, వెంక‌ట్‌రెడ్డి కలిసిపోయినట్లే క‌నిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నారు. వెంక‌ట్‌రెడ్డిని తనకు అనుకూలంగా మార్చుకోవడం వెనుక రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు కాకుండా బలమైన నాయ‌కుల‌ను గుర్తించి వాళ్ల‌తో చ‌ర్చించేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పుడు వెంక‌ట్‌రెడ్డితో న‌ల్గొండ‌కు చెందిన మ‌రో సీనియ‌ర్ నేత ఉత్త‌మ్‌, దామోద‌ర్ రెడ్డి వంటి వారికి కూడా చెక్ పెట్టొచ్చ‌ని రేవంత్ ఆలోచిస్తున్నార‌ని తెలిసింది. ఇలా అస‌మ్మ‌తిని త‌గ్గించే విష‌యంలో రేవంత్ దూకుడుగా సాగుతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు.