Begin typing your search above and press return to search.

‘ఏపీ రాజధాని విశాఖ’పై కేంద్రం తాజా వివరణ

By:  Tupaki Desk   |   30 Aug 2021 2:11 AM GMT
‘ఏపీ రాజధాని విశాఖ’పై కేంద్రం తాజా వివరణ
X
ఏపీ రాజధాని విశాఖపట్నంగా కేంద్రం పేర్కొందన్న విషయం ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా బయటకు రావటం.. ఆ వాదనకు బలం చేకూరేలా ఒక డాక్యుమెంట్ ను చూపించటం.. అది కాస్తా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జారీ చేసింది కావటంతో..నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారింది.

గంటల వ్యవధిలో ఈ ఇష్యూ అంతకంతకూ పెద్దదైంది. ఇంతకూ జరిగిందేమంటే.. ఇటీవల లోక్ సభ సమావేశాల్లో ఎంపీ ఒకరు పెట్రోల్.. డీజిల్ మీద రాష్ట్రాలు వసూలు చేసే పన్ను వివరాలు ఇవ్వాలని కోరటం.. అందుకు బదులుగా సదరు మంత్రిత్వ శాఖ దాని డిటైల్స్ ఇచ్చింది. అందులో రాష్ట్రం.. సదరు రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని పేర్కొంటూ.. ఆయా రాష్ట్రాలు పెట్రోల్.. డీజిల్ మీద వసూలు చేస్తున్న పన్ను లెక్కల్ని రాతపూర్వకంగా ఇచ్చింది. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన వివరాల్ని కొత్త రగడకు తెర తీశాయి.

ఎందుకంటే.. ఏపీ రాజధాని అమరావతిగా ఉండాల్సిన చోట విశాఖపట్నంగా పేర్కొనటంతో అంతా ఉలిక్కిపడిన పరిస్థితి. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ జగన్ సర్కారు మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయటం.. విశాఖను పాలనా రాజధానిగా నిర్ణయించటం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఇలాంటివేళ.. ఏపీ రాజధాని విశాఖ అని కేంద్రం పేర్కొనటంతో ఇదో ఇష్యూగా మారింది. రాజకీయ రగడకు అవకాశాన్ని ఇచ్చింది.

సాధారణంగా ఇలాంటి అంశాల మీద కేంద్రం ఒక పట్టాన స్పందించదు. మీరెంత అడిగినా.. మేం చెప్పేదేముండదన్నట్లుగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో అంశాల్లో ఇలా జరగ్గా.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఆదివారం అయినప్పటికీ గంటల వ్యవధిలోనే ఈ ఇష్యూ మీద మోడీ సర్కారు క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఏపీ రాజధాని విశాఖ అని ఎందుకు పేర్కొనాల్సి వచ్చిందన్న అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొనటంలో తప్పు జరిగిందని.. దాన్ని సరిదిద్దినట్లుగా చెప్పింది. విశాఖపట్నం ఏపీ రాజధాని ఎంతమాత్రం కాదని.. అదొక నగరం మాత్రమేనని పేర్కొంది. పెట్రోల్..డీజిల్ పై విధించే పన్నులకు సంబంధించి తాము సమాచారం అడిగిన నగరం పేరును పెడుతుంటామని.. అదే రీతిలో విశాఖ విషయంలోనూ జరిగిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల ప్రభావాన్ని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.

ఏపీ రాజధాని అమరావతికి బదులుగా విశాఖను పేర్కొనటంపై కేంద్రం తీరును పలువురు తప్పు పడుతున్న వేళ.. ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టేలా కేంద్రం తన వాదనను వినిపించటం గమనార్హం. జాబితాలో పంజాబ్ లోని జలంధర్ పేరు కూడా ఉందని.. పంజాబ్ రాజధాని జలంధర్ కాదు కదా? అని చెబుతూ.. తాము సమాచారం అందించిన పట్టణం పేరును ప్రస్తావించామని.. రాజధాని నగరంగా పైన తప్పుగా పేర్కొనటం జరిగిందని చెప్పింది.

ఇప్పటికే ఏపీ రాజధానిపై రగడ జరుగుతున్న వేళ.. దీన్ని అట్టే పొడిగించకూడదన్నది కేంద్రం ఆలోచన అన్నట్లుగా కేంద్రం స్పందన ఉన్నట్లుగా చెప్పక తప్పదు. మొత్తానికి ఏపీ రాజధాని విశాఖ అంటూ విడుదల చేసిన పత్రం కారణంగా రగిలిన ఆందోళనను మరింత పెరగకుండా.. దాన్ని ఆదిలోనే తుంచేలా కేంద్రం సమాధానం ఉందని చెప్పక తప్పదు. ఏపీ రాజధాని ప్రస్తుతానికి అమరావతినే అన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.