Begin typing your search above and press return to search.

మ‌రో వివాదంలో కేటీఆర్ ..ఈ సారి టార్గెట్ ఎవ‌రంటే ?

By:  Tupaki Desk   |   17 March 2022 3:29 AM GMT
మ‌రో వివాదంలో కేటీఆర్ ..ఈ సారి టార్గెట్ ఎవ‌రంటే ?
X
పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ వివాదంలో ఇరుక్కున్నారు.హైద్రాబాద్ న‌గ‌రాన్ని ఏటా వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్న సంగ‌తి తెలిసిందే! చాలా శివారు ప్రాంతాలు మ‌రియు లోత‌ట్టు ప్రాంతాలు కూడా నీట మునిగి ప్ర‌జ‌ల‌కు క‌న్నీళ్లే మిగులుస్తున్నాయి.అధిక వ‌ర్షాల కార‌ణంగా ఏటా ఈ చిత్రం పున‌రావృతికి నోచుకుంటూనే ఉంది. ఈ సంద‌ర్భంలో ప్ర‌భుత్వాలు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే ఉన్నాయి.

హైద్రాబాద్ చుట్టూ ఉన్న వేల చెరువులు ఇంకా చెప్పాలంటే గొలుసు క‌ట్టు రూపాన ఉన్న చెరువులు అన్నీ క‌బ్జాల‌కు గురై అపార్ట్మెంట్లుగా మారిపోయాయి అని అందుకే ఈ దుః స్థితి అని త‌రుచూ ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న చెందుతూనే ఉన్నారు.

ఈ ద‌శ‌లో మంత్రి కేటీఆర్ స‌మ‌స్య నివార‌ణ‌కు త‌మ ప్ర‌భుత్వం ఓ వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేయ‌నుంద‌ని, అదేవిధంగా కేంద్రం ప‌దివేల కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేయాల‌ని అందుకు కిష‌న్ రెడ్డి (కేంద్ర మంత్రి) చొర‌వ చూపాల‌ని డిమాండ్ చేస్తూ అదే స‌మ‌యంలో త‌న‌దైన శైలిలో స‌వాల్ చేశారు.నిధులు తెస్తే ఆయ‌న‌కు ఘ‌న సన్మానం చేస్తామ‌ని కూడా అన్నారు.

ఇక హైద్రాబాద్ అభివృద్ధికి ఏటా కేంద్రం నిధులు ఇస్తున్నా అవి వినియోగంలోకి రావ‌డం లేద‌ని బీజేపీ అంటోంది. బీజేపీ వాద‌న ఎలా ఉన్నా ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తులు చెరువ‌ల క‌బ్జాల‌ను నిలువ‌రిస్తే వ‌ర‌ద ముంపు స‌మ‌స్య అన్న‌ది రానే రాదు.

పోనీ ప్ర‌త్యామ్నాయ దారుల్లో నీటి మ‌ళ్లింపున‌కు చ‌ర్య‌లు చేప‌డితే కాస్తో కూస్తో న‌గ‌ర వాసికి ఉప‌శ‌మ‌నం.అభివృద్ధి పేరిట కోట్ల రూపాయ‌ల వెచ్చింపు బాగానే ఉన్నా ఆధునిక రోడ్లు ఫ్లై ఓవ‌ర్ల నిర్మాణం బాగానే ఉన్నా ముంపు స‌మ‌స్య‌ను కూడా అదే స్థాయిలో అంతే చిత్త‌శుద్ధితో ప‌రిష్క‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. సుంద‌ర న‌గ‌రిగా పేరున్న హైద్రాబాద్ ఒక‌ప్పుడు భౌగోళికంగా ఎంతో ఉన్న‌త స్థాయిలో ఉండేది అన్న‌ది వాస్తవం.

చుట్టూ చెరువులు తాగునీటికి అస్స‌లు కొద‌వే లేని వైనం ఇవ‌న్నీ పోయి ఇప్పుడు గుక్కెడు నీటి కోసం అర్రులు చాస్తున్న ద‌య‌నీయ స్థితి ప్ర‌జ‌లకు ఎదురౌతోంది.ఈ ద‌శ‌లో కిష‌న్ రెడ్డి అనే కాదు కేటీఆర్ అనే కాదు ముందు క‌బ్జాల తొలగింపుపై చ‌ర్య‌లు చేపడితే ఏనాటి నుంచో ఉన్న నీటి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ సాధ్యం. వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉన్న చెరువుల ప‌రిర‌క్ష‌ణ సాధ్యం.త‌ద్వారా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ స‌మ‌తుల్య‌త ఇలా ఒక్క‌టేంటి అన్నీ సాధ్యం. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా కేవ‌లం వ్య‌ర్థ రాజ‌కీయాల‌కే కేటీఆర్ కానీ కిష‌న్ రెడ్డి కానీ ప్రాధాన్యం ఇవ్వ కూడ‌దు అన్న‌ది న‌గ‌ర వాసుల వేడుకోలు.