Begin typing your search above and press return to search.

మ్యానిఫెస్టో ఏదండి..బాబు గారూ !

By:  Tupaki Desk   |   29 May 2022 8:30 AM GMT
మ్యానిఫెస్టో ఏదండి..బాబు గారూ !
X
రెండ్రోజుల మ‌హానాడు .. అంత‌కుమునుపు ఒక రోజు పొలిట్ బ్యూరో స‌మావేశం.. అంతా క‌లిపి మూడ్రోజుల వేడుక ముగిసింది. ఒంగోలు నుంచి ఎవ‌రికి వారు తిరుగు ప్ర‌యాణం అవుతున్నారు.

మ‌హానాడు ఓ గొప్ప జ్ఞాపకం అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొంగిపోతున్నాయి. అదే విధంగా వివిధ జిల్లాల ప్ర‌తినిధులు త‌మ‌కు ద‌క్కిన భాగ్యం ఇదే అని అంటున్నారు. ఇదంతా బాగుంది కదా! మ‌రి మైన‌స్సుల మాటేంటి ? మైలేజీల మాటేంటి ?

ముఖ్యంగా చంద్ర‌బాబు నుంచి చాలా ఆశించిన వారికి ఓ విధంగా నిరాశ. ఎందుకంటే క‌నీసం ఓ డ‌బ్బై సీట్లకు సంబంధించి అయినా ముంద‌స్తుగా అభ్య‌ర్థులు ప్ర‌క‌టిస్తార‌ని ఆశించారు. కానీ అవేవీ జ‌ర‌గ‌లేదు. పోనీ ముంద‌స్తుగా మ్యానిఫెస్టోలో విష‌యాలు ఏమ‌యినా చెప్పారా అంటే అదీ లేదు.

మ‌హానాడు అన్న‌ది కేవ‌లం కొన్ని విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అయిపోయింద‌న్న వాద‌న కూడా ఉంది. ఆ వాద‌న‌ను దాటి అధినేత కొన్ని ప‌నులు చేయాల్సి ఉంది ఇప్ప‌టికైనా!

మ‌హానాడు కు పోటీగా మంత్రుల బ‌స్సు యాత్ర‌కూ జ‌నం వ‌చ్చారు. అదే విధంగా మ‌హానాడుకూ వ‌చ్చారు. జ‌నం వ‌చ్చినంత‌నే అవ‌న్నీ విజ‌య‌వంతం అయిన స‌భ‌లు అయిపోవు. రేప‌టి వేళ వాళ్లంతా ఎటు వైపు మొగ్గు చూపుతారో అన్న‌దే కీల‌కం.

ఏ మాట‌కు ఆ మాట తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు చాలా క‌ష్టాలు ప‌డి జిల్లాలు దాటి ఒంగోలు చేరుకున్నారు. చాలా క‌ష్టాలు ప‌డి ఆ మూడు రోజులూ అక్క‌డే ఉన్నారు. ఆ నిబ‌ద్ధ‌త చాలా బాగుంది కానీ అధినేత నుంచి మాత్రం వారికి ఏ హామీ ల‌భ్యం కాలేదు.

కేసులు పెట్టించుకోండి మేం అధికారంలోకి రాగానే ఎత్తివేస్తాం అన్న మాట ఒక్క‌టే ప‌దే ప‌దే వినిపిస్తూ వ‌చ్చింది. ఆ మాట త‌ప్ప మిగిలిన మాట‌లేవీ పెద్ద‌గా తీవ్ర స్వ‌రంతో వినిపించిన దాఖ‌లాలు లేవు. ఇప్ప‌టికైనా అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తాం అన్న‌ది చెబితే బాగుంటుంది బాబు అని విప‌క్షంను ఉద్దేశించి వైసీపీ అంటోంది.