Begin typing your search above and press return to search.

రాజస్ధాన్ కాంగ్రెస్ లో మళ్ళీ మంటలు

By:  Tupaki Desk   |   30 May 2022 1:30 AM GMT
రాజస్ధాన్ కాంగ్రెస్ లో మళ్ళీ మంటలు
X
రాజస్ధాన్ కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు విషయంలో మళ్ళీ మంటలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం చింతన్ శివిర్ ఏర్పాటై 15 రోజులు కూడా కాకుండానే పార్టీలో అసమ్మతి మళ్ళీ బయటపడుతోంది.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను పక్కకు తప్పించి సచిన్ పైలెట్ ను సీఎంను చేయాలంటు పైలెట్ వర్గం చాలాకాలంగా బలంగా డిమాండ్లు చేస్తోంది. పార్టీ కీలక సమావేశంలో యువతకు పెద్దపీట వేయాలని తీర్మానం చేస్తూనే మరోవైపు 70 ఏళ్ళు దాటిన గెహ్లాట్ ను కంటిన్యూ చేయాలని అనుకోవటమే విచిత్రం.

వాస్తవానికి పోయిన ఎన్నికల్లో రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో పైలెట్ ది కీలకపాత్ర. రాష్ట్రమంతా పర్యటించి, సభలు, ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహించి జనాలను సమాయత్తం చేశారు. పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి సమిష్టిగా పనిచేసేందుకు పైలెట్ చాలానే కష్టపడ్డారు. అప్పటికే సీనియర్ నేతగా ఉన్న గెహ్లాట్ పాత్ర తక్కువనే చెప్పాలి.

కాకపోతే పార్టీ అధికారంలోకి రాగానే సోనియాగాంధీతో తనకున్న సన్నిహిత్యాన్ని అడ్డంపెట్టుకుని గెహ్లాట్ ఏకంగా ముఖ్యమంత్రయిపోయారు.

అప్పటినుండి పైలెట్-గెహ్లాట్ మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. పైగా సీఎం అయిన వెంటనే గెహ్లాట్ పైలెట్ ను ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. పైలెట్ వర్గానికి అప్రాధాన్యత శాఖలు కేటాయించి అవమానించారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదాలు బాగా పెరిగిపోయాయి. ఒక దశలో గెహ్లాట్ కారణంగా తన వర్గంతో కలిసి పైలెట్ కాంగ్రెస్ ను విడిచి వెళ్ళిపోయే ఆలోచన కూడా చేశారు. అదే జరిగుంటే పార్టీ ఎప్పుడో అధికారంలో నుండి దిగిపోయుండేదే.

ఏదో నాయకత్వం సకాలంలో మేల్కొనటం వల్ల పైలెట్ ఇంకా పార్టీలోనే ఉన్నారు. పార్టీలోనే ఉన్నా ఈ రెండు వర్గాల మధ్య ఏనాడు పడిందిలేదు. మళ్ళీ ఏడాదిలోగా ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడైనా అధిష్టానం మేల్కొని క్షేత్రస్థాయిలో ఎవరికి బలం వుందో గ్రహించి వారికి మద్దతుగా నిలబడితే బాగుంటుంది.

ముఖ్యమంత్రిగా ఉండటం గెహ్లాట్ కు మూడోసారి. ఎంతకాలమైనా తానే సీఎంగా ఉండాలన్న గెహ్లాట్ అత్యాసే పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. మరి ఢిల్లీకి చేరుకున్న పైలెట్ వర్గాన్ని అధిష్టానం ఎలా డీల్ చేస్తుంది.