Begin typing your search above and press return to search.

తీర్చలేని కష్టం: మచ్చలేని నేత మరణంతో తల్లడిల్లుతున్న నెల్లూరు జిల్లా

By:  Tupaki Desk   |   21 Feb 2022 9:32 AM GMT
తీర్చలేని కష్టం: మచ్చలేని నేత మరణంతో తల్లడిల్లుతున్న నెల్లూరు జిల్లా
X
మచ్చలేని రాజకీయాలు ఇవాల్టి రోజుల్లో కష్టం. ఉన్నత చదువులు చదివి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటికీ.. దాని బురద తనకు అంటుకోకుండా ఉండేలా వ్యవహరించటం ఇవాల్టి రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. అలాంటి వాటికి అతీతంగా వ్యవహరించే నేతగా.. ఏపీ మంత్రిగా సుపరిచితుడు మేకపాటి గౌతమ్ రెడ్డి. పార్టీలకు అతీతంగా వ్యవహరించే ఆయన్ను అభిమానించే వారే కానీ ఆగ్రహం వ్యక్తం చేసే వారే ఉండరు. తాను హార్డ్ కోర్ జగన్ అభిమాని అన్న విషయాన్ని సైతం హుందాగా చెప్పటం.. వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా వ్యవహరించటం ఆయనకు మాత్రమే సాధ్యం.

అలాంటి మేకపాటి గౌతమ్ రెడ్డి.. అనూహ్య మరణంతో నెల్లూరు జిల్లా వాసులు తల్లడిల్లిపోతున్నారు. జిల్లా రాజకీయాల్లో ఆనం.. మేకపాటి కుటుంబాలకు ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రత్యర్థులపైనా ఆయన తొందరపడి ఒక మాట అనేందుకు ఇష్టపడే వారు కాదు. మంత్రిగా ఆయన వయసు మూడేళ్లు మాత్రమే అయినా.. తన పని తీరులో కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్నారు. ఆయన హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సౌమ్యుడిగా.. వివాద రహితుడిగా ఆయనకు పేరుంది. ఆయనెంతో మృధుస్వభావిగా చెబుతుంటారు. కోపతాపాలు ప్రదర్శించని వ్యక్తిగాఆయనకు పేరుంది.

అందరితోనూ కలిసిపోయే తత్త్వంతో పాటు.. డైనమిక్ లీడర్ గా పేరుంది. టెక్నాలజీ మీద పట్టు ఉన్న ఆయన్ను రాష్ట్ర ఐపీ మంత్రిగా సీఎం జగన్ బాధ్యతలు అప్పజెప్పారు. సీఎం జగన్ మానసపుత్రిక అయిన స్కిల్ డెవలప్ మెంట్ లో గౌతమ్ రెడ్డి ఎంతో స్టడీ చేయటంతో పాటు.. దాన్ని అమలు విషయంలోనూ రాత్రి పగలుఅన్న తేడా లేకుండా కష్టపడేవారు. ఆయన మరణ వార్త విన్నంతనే జిల్లా వ్యాప్తంగా శోకతప్త హృదయంతో మునిగిపోయింది. ఆయన వ్యవహారశైలి.. స్నేహపూర్వకంగా వ్యవహరించే తీరును గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అపోలో ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసానికి తరలించారు. ఈ రోజు (సోమవారం) రాత్రి ఆయన భౌతికకాయాన్ని నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి కుమారుడు అమెరికాలో ఉన్నారు. అతను వచ్చిన తర్వాత బుధవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఏపీ ప్రభుత్వంలో పరిశ్రమలు.. వాణిజ్య.. ఐటీ శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న గౌతమ్ రెడ్డి మరణాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అస్సలు నమ్మలేకపోయారు. ఇదే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.జగన్ కు క్లాస్ మేట్ అయిన గౌతమ్ రెడ్డి.. ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్సీ పూర్తి చేశారు.

సీనియర్ రాజకీయ నేత.. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడైన గౌతమ్ రెడ్డికి ముగ్గురు కుమారులు. వారిలో గౌతమ్ రెడ్డి ఒకరు. 2014లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆత్మకూరునియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించటంతో పాటు.. మంత్రి పదవిని చేపట్టారు.