Begin typing your search above and press return to search.

ప్రీతిరెడ్డి హత్యకేసు.. అతడి మరణంతో అంతా గందరగోళం

By:  Tupaki Desk   |   8 March 2019 3:30 PM GMT
ప్రీతిరెడ్డి హత్యకేసు.. అతడి మరణంతో అంతా గందరగోళం
X
ఆస్ట్రేలియా సిడ్నీలో డెంటిస్ట్‌ గా పని చేస్తున్న మహబూబ్‌ నగర్‌ కు చెందిన ప్రీతిరెడ్డి హత్య కేసు అక్కడి పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రీతిరెడ్డి హత్య చేసింది ఎవరని ఎంక్వౌరీ చేస్తున్న సమయంలో వారికి ప్రతి విషయంలో కూడా ఆమె మాజీ ప్రియుడు హర్షవర్దన్‌ నార్డే గురించిన విషయాలు తెలుస్తున్నాయి. దాంతో ఆయనే హత్య చేసి ఉంటాడని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే హత్య జరిగిన తెల్లారే హర్షవర్దన్‌ అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఎంక్వౌరీ ఎటూ సాగడం లేదు. అతడు బతికి ఉంటే ఇప్పటి వరకు కేసు విషయంలో క్లారిటీ వచ్చేది. కాని హర్షవర్ధన్‌ మృతితో ఈ కేసు ఎక్కడ నుండి ఎటు తీసుకు వెళ్లాలి అనే విషయం అక్కడి పోలీసులకు తెలియడం లేదట.

2013 నుండి లవ్‌ లో ఉన్న ప్రీతిరెడ్డి మరియు హర్షవర్దన్‌ లు గత నవంబర్‌ లో విడిపోయినట్లుగా వారి కామన్‌ స్నేహితులు చెబుతున్నారు. హర్ష వర్ధన్‌ తో విడిపోయిన తర్వాత మరో వ్యక్తితో ప్రీతి ప్రేమలో పడిందట. ఆ విషయాన్ని హర్షవర్దన్‌ కు కూడా స్నేహితులు తెలియజేయడం జరిగిందట. ఇక మార్చి 2వ తారీకున జరిగిన ఒక మెడికల్‌ సెమినార్‌ కోసం సిడ్నీ వచ్చిన హర్ష తో ప్రీతి మాట్లాడిందని, ఆ సమయంలో వారిద్దరి మద్య కొత్త ప్రేమ గురించిన చర్చ కూడా జరిగిందని స్నేహితులు చెబుతున్నారు.

మార్చి 2వ తారీకు సాయంత్రం 7 గంటల సమయంలో సెమినార్‌ పూర్తి అయిన తర్వాత వారిద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రోజు అంటే మార్చి 3వ తారీకు ఉదయం 11 గంటల సమయంలో ప్రీతిరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రీతిరెడ్డి మార్చి 3వ తారీకు మద్యాహ్నం 1.47 వరకు ఆన్‌ లైన్‌ లో ఉన్నట్లుగా చూపిస్తుంది. ఆ తర్వాత నుండి ఆన్‌ లైన్‌ లో లేదు. అంటే మార్చి 3వ తారీకున 1.47 తర్వాత ఆమెను హత్య చేసి ఉంటారనే అంచనాకు వచ్చారు. మార్చి 4వ తారీకున తెల్లవారు జామున సూట్‌ కేసులో ప్రీతిరెడ్డి డెడ్‌ బాడీ కనిపించింది. ఈ హత్య ఆమె మాజీ ప్రియుడు హర్షవర్ధన్‌ చేసి ఉంటాడని కామన్‌ ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. కాని ఆ విషయం కన్ఫర్మ్‌ చేసుకునేందుకు హర్షవర్ధన్‌ లేకపోవడంతో కేసు గందరగోళంలో పడ్డట్లయ్యింది. మరి ఈ కేసును ఆస్ట్రేలియన్‌ పోలీసులు ఎలా సాల్వ్‌ చేస్తారో చూడాలి.