Begin typing your search above and press return to search.

అనకాపల్లి బెల్లం కోసం తమ్ముళ్ళ ఫైట్ ...?

By:  Tupaki Desk   |   6 March 2022 12:30 AM GMT
అనకాపల్లి బెల్లం  కోసం తమ్ముళ్ళ ఫైట్  ...?
X
అనకాపల్లి అంటే బెల్లానికి ప్రసిద్ధి. ఇపుడు కొత్తగా అది జిల్లా కూడా అవుతోంది. దాని కంటే ముందు చూసుకున్నా కూడా అనకాపల్లికి విశాఖ జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖుల స్థావరంగా రాజకీయ కేంద్రంగా దాన్ని చెబుతారు. ఇక వ్యాపారపరంగా చూసుకుంటే దేశంలోనే అతి పెద్ద బెల్లం మార్కెట్ ఇక్కడ ఉంది. అలా అనకాపల్లికి ఎన్నో విశేషాలున్నాయి.

ఇక కొత్తగా జిల్లా కేంద్రం కావడంతో ఈసారి ఎమ్మెల్యే కావాలని చాలా మంది తెగ ఆరాటపడుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రజా ప్రతినిధి కావడం అంటే ఆ హవాయే వేరు అన్నది రాజకీయ జీవుల భావన. ఇదిలా ఉంటే టీడీపీపీలో అనకాపల్లి సీటు కోసం యమ టైట్ ఫైట్ సాగుతొంది. అనకాపల్లి ఎవరిది అన్న చర్చ కూడా వస్తోంది.

మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ వచ్చేసారి తనకే టికెట్ అని గట్టి నమ్మకం మీద ఉన్నారు. ఆయన 2014లో ఫస్ట్ టైమ్ టీడీపీ తరఫున రంగంలోకి దిగి గెలిచారు. 2019లో వైసీపీ వేవ్ లో ఓడిపోయారు. మూడవసారి కూడా తనకే టికెట్ ఇవ్వాలని, ఇస్తారని ఆశపడుతున్నారు.

ఇక ఎటూ నియోజకవర్గం ఇంచార్జిని కాబట్టే తనకు పోటీ ఎవరూ ఉండరని కూడా భావిస్తున్నారు. అయితే ఆయనకు గట్టి పోటీ పక్కనే ఉంది. అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఈసారి ఆరు నూరు అయినా తానే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని క్యాడర్ తో చెప్పేసుకుంటున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లోనే తనకు టికెట్ రావాలని, అయితే సిట్టింగులకు టికెట్ అని ఒక నిర్ణయం నాడు పార్టీ తీసుకోవడం వల్ల చాన్స్ తప్పిందని ఆయన భావిస్తున్నారు.

ఇక ఈసారి మాత్రం తాను ఎట్టి పరిస్థితులలోనూ పోటీ చేసి ఎమ్మెల్యేగానే చట్ట సభలో అడుగుపెడతాను అని అంటున్నారు. ఇక వైసీపీ మీద ప్రతీ రోజు ఘాటైన విమర్శలు చేయడంతో నాగ జగదీశ్వరరావు జోరు చూపిస్తున్నారు. అధినేత చంద్రబాబుకు ఇష్టుడిగా పేరు పడ్డారు. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను చేపడుతుతూ ముందు వరసలో ఉన్నారు.

అయితే ఆయనకు మైనస్ అర్ధ బలమని అంటున్నారు. అయినా సరే టికెట్ దక్కితే చూసుకుంటానని చెప్పే వారు చాలా మంది ఉన్నారు. ఇక పీలా విషయానికి వస్తే ఆయనకు అంగబలం, అర్ధబలం రెండూ ఉన్నాయి. అయితే నాన్ లోకల్ అన్నది మైనస్ గా ఉంది. దాంతో అధినాయకత్వానికీ ఈ ఇద్దరూ పెద్ద పరీక్షనే పెడుతున్నారు అనుకోవాలి.

అనకాపల్లి బెల్లం ముక్క నాకంటే నాకని పోటీ పడుతున్న ఈ ఇద్దరు తమ్ముళ్ల తగవు తీర్చడం హై కమాండ్ కి చాలా కష్టమే అంటున్నారు. ఇద్దరూ విధేయులే. ఇద్దరూ బలమైన నేతలే. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో హై కమాండ్ ఈ ఇద్దరి పోరును వేరే వారిని మధ్యకు తెచ్చి తీర్చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి టీడీపీ టికెట్ అనే బెల్లం ముక్క ఎవరి నోట్లో పడుతుందో.