Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ బండి అడుగులు.. ఈ సారి మ‌రింత వేగంగా!

By:  Tupaki Desk   |   14 April 2022 11:30 AM GMT
మ‌ళ్లీ బండి అడుగులు.. ఈ సారి మ‌రింత వేగంగా!
X
తెలంగాణ రాజ‌కీయాలు ఇప్ప‌టికే టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీగా మారాయి. ఇప్పుడు ఆ హీట్‌ను మ‌రింత పెంచేందుకు.. కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే టార్గెట్‌గా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రెండో ద‌శ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుడుతున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్క‌ర్ జ‌యంతి రోజు అంటే నేడే గ‌ద్వాల జోగులాంబ ఆల‌యం నుంచి రెండో ద‌శ ప్ర‌జా సంగ్రామ యాత్ర మెద‌లెట్ట‌నున్నారు. 31 రోజుల పాటు 386 కిలోమీట‌ర్ల మేర ఈ యాత్ర కొన‌సాగుతుందని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. అయిదు జిల్లాలు, మూడు పార్ల‌మెంట్, 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ యాత్ర సాగుతుంది.

తెలంగాణ‌లో బ‌లోపేతంపై దృష్టి సారించిన బీజేపీ ఆ దిశ‌గా తీవ్రంగా శ్ర‌మిస్తోంది. అధిష్ఠానం నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో రాష్ట్ర బీజేపీ నేత‌లు సీఎం కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం కోసం గ‌తేడాది ఆగ‌స్టు 28న బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర మొద‌లెట్టారు. చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యం నుంచి పాద‌యాత్ర ప్రారంభించిన ఆయ‌న 36 రోజుల పాటు 438 కిలోమీట‌ర్లు తిరిగారు. ఎనిమిది జిల్లాల్లో ఆరు పార్ల‌మెంట్‌, 19 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆయ‌న క‌వ‌ర్ చేశారు. ఇప్పుడికి రెండో ద‌శ పాద‌యాత్ర‌లో రెట్టించిన ఉత్సాహంతో సాగేందుకు సంజ‌య్ సిద్ధ‌మ‌య్యారు.

ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాలు మారుతున్నాయి. అసెంబ్లీలో బీజేపీ బ‌లం మూడుకు పెరిగింది. మ‌రోవైపు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై కేసీఆర్ చేస్తున్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌ను రాష్ట్ర కాషాయ ద‌ళ నేత‌లు స‌మ‌ర్థంగా తిప్పికొడుతున్నారు. మాట‌కు మాట‌.. ఆందోళ‌న‌కు నిర‌స‌న‌ల‌తో కౌంట‌ర్ ఇస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో సంజ‌య్ మ‌రోసారి పాద‌యాత్ర‌కు రెడీ అవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ రోజు సాయంత్రం జోగులాంబ ఆల‌యంలో పూజ‌ల త‌ర్వాత సంజ‌య్ రెండో ద‌శ పాద‌యాత్ర మొద‌ల‌వుతుంది. బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జీ త‌రుణ్‌చుగ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఈ యాత్ర ప్రారంభిస్తారు.

జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఆలంపూర్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, మక్తల్, జడ్చర్ల, దేవరకద్ర, కల్వకుర్తి, మహేశ్వరం నియోజకవర్గాల వారీగా సాగనుంది. కేసీఆర్ సర్కారు అవినీతి, నియంత, కుటుంబ పాల‌నను ప్రజల్లో ఎండ‌గ‌ట్టటమే లక్ష్యంగా బండి సంజయ్ పాద‌యాత్ర చేపడుతున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా అంబేడ్క‌ర్ జ‌యంతి రోజు త‌న రెండో విడ‌త పాద‌యాత్రను సంజ‌య్ మొద‌లెడుతున్నారు. వేస‌వి కావ‌డంతో ఉద‌యం, సాయంత్రం పాద‌యాత్ర ఉండేలా.. మ‌ధ్యాహ్నం పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశాలు ఉండేలా కార్య‌చ‌ర‌ణ రూపొందించారు. మ‌రి ఈ పాద‌యాత్ర‌లో కేసీఆర్ఫై సంజ‌య్ ఏ రేంజ్‌లో రెచ్చిపోతారో చూడాలి.