Begin typing your search above and press return to search.

అసెంబ్లీ : బాబు రాక ఇక లేన‌ట్లేనా ?

By:  Tupaki Desk   |   3 March 2022 5:37 AM GMT
అసెంబ్లీ : బాబు రాక ఇక లేన‌ట్లేనా ?
X
గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ర‌భ‌స నెల‌కొన్న కార‌ణంగా చంద్ర‌బాబు శ‌ప‌థం చేసి వెళ్లారు.త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి, ముఖ్యంగా త‌న జీవ‌న స‌హ‌చ‌రి భువ‌నేశ్వ‌రిని ఉద్దేశించి వైసీపీ స‌భ్యులు అవ‌మాన‌క‌ర రీతిలో మాట్లాడార‌ని,తాను ఎన్న‌టికీ వాటిని మ‌రువ‌లేన‌ని అన్నారు చంద్ర‌బాబు.తాను మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తేనే అసెంబ్లీలోకి వ‌స్తాన‌ని కూడా అన్నారు చంద్ర‌బాబు. దీంతో ఆయ‌న శ‌ప‌థం చేసి వెళ్లిన విష‌యాన్నే వైసీపీ మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేయాలని చూస్తోంద‌ని స‌మాచారం.కీల‌కసంద‌ర్భాల్లో ప్ర‌తిప‌క్ష నేత హోదాలో స‌భ‌లో లేక‌పోతే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌న్న వాద‌న కూడా ఉంది.

బ‌డ్జెట్ స‌మావేశాలు 11 నుంచి ప్రారంభం కానున్నాయి.అంత‌కుమునుపే ఈ నెల ఏడు నుంచి శాస‌న స‌భ,మండ‌లి స‌మావేశాలు ఆరంభం కానున్నాయి. వీటిలో చాలా కీల‌క విష‌యాలు ప్ర‌స్తావ‌నకు రానున్నాయి.3 రాజ‌ధానుల‌పై ప్ర‌భుత్వం మ‌ళ్లీ బిల్లు ప్ర‌వేశ పెట్టే అవ‌కాశాలు కూడా కొట్టిపారేయ‌లేం. సీఆర్డీఏను పున‌రుద్ధ‌రించారు క‌నుక సంబంధిత బిల్లు కూడా తెర‌పైకి రానుంది.

వీట‌న్నింటి క‌న్నా మించి కేంద్రం ఇటీవ‌ల చెప్పిన విధంగా అమ‌రావతిని రాజ‌ధానిగానే గుర్తిస్తూ కొన్ని నిధుల స‌ర్దుబాటుకు ముందుకు రావ‌డం అన్న‌ది గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం.ఇది కూడా చ‌ర్చ‌కు రానుంది.కేంద్ర‌మే గుర్తించిన‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుక‌ని వీటిపై మాట్లాడ‌డం లేదు అన్న పాయింట్ ను టీడీపీ రైజ్ చేసేందుకు ఆస్కారం ఉంది.అలాంట‌ప్పుడు ఓ విప‌క్ష నేతగా, ముఖ్యంగా అమ‌రావ‌తి నిర్మాణానికి పూనిక‌వ‌హించిన వ్య‌క్తిగా స‌భ‌లో లేకుండా పోతే వైసీపీకి స‌రైన స‌మాధానం ఎవరు చెబుతారు అన్న‌ది కూడా ఓ పెద్ద చ‌ర్చ‌కు తావిస్తోంది.

ఇవే కాకుండా రాష్ట్రాన్ని క‌దిపి కుదిపేస్తున్న ప‌లు విష‌యాలు, బడ్జెట్ కేటాయింపులు వీట‌న్నింటిపై అచ్చెన్న క‌న్నా బాగా మాట్లాడాల్సిన వ్య‌క్తి చంద్ర‌బాబే! ఇదే స‌మ‌యంలో వివేకా హ‌త్య కు సంబంధించి సీబీఐ ద‌ర్యాప్తు సాగుతున్న నేప‌థ్యంలో సంబంధిత విష‌యాల‌పై ఇప్ప‌టికే చాలా అభ్యంతరాలు చెప్పింది టీడీపీ.అవి స‌భాముఖంగా మ‌రోసారి వినిపించాల‌న్నా,లేదా మ‌రికొన్ని అభ్యంత‌రాలు ద‌ర్యాప్తున‌కు సంబంధించి తెలియ‌జేయాల‌న్నా చంద్ర‌బాబు స‌భ‌కు రావాల్సిందే! చంద్ర‌బాబు స‌భ‌కు రాకుండా అస్త్ర స‌న్యాసం చేస్తామంటే మాత్రం అంత‌కుమించిన త‌ప్పిదం మ‌రొక‌టి ఉండ‌దు.

ఫ్లోర్ లో చ‌ర్చ‌కు రానున్న వాటిపై అక్క‌డికక్క‌డ విప‌క్షం కౌంట‌ర్ ఇవ్వాలంటే లేదా అప్ప‌టిక‌ప్పుడు సంద‌ర్భం అనుసారం వ్యూహ ప్ర‌తివ్యూహాలు పార్టీ త‌ర‌ఫున సిద్ధం చేయాలంటే చంద్ర‌బాబు స‌భ‌కు రావాల్సిందే అన్న అభిప్రాయం ఇప్పుడు అంద‌రిలోనూ ఉంది.ముఖ్యంగా రాజ‌ధానికి సంబంధించి బిల్లు మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టేవేళ స‌హ‌జ న్యాయ సూత్రాల‌కు విరుద్ధంగా ఉన్న విష‌యాల‌ను అడ్డుకోక పోయినా లేదా 3 ప్రాంతాల విష‌య‌మై స‌రైన రీతిలో అభ్యంత‌రాలు చెప్ప‌క‌పోయినా ఇవాళ టీడీపీకి మ‌నుగ‌డ అన్న‌ది ఉండదు అన్న‌ది తేలిపోయిన విష‌యం.అంతేకాదు ఇప్ప‌టికే రాజ‌ధాని రైతుల దీక్ష‌ల‌ను సైతం ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ ఒక‌టి టీడీపీ చేస్తోంది.

దీనిని కూడా స్పీక‌ర్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత స‌మ‌స్య‌పై సానుకూల ప‌రిష్కారం చూపేందుకు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సింది కూడా చంద్ర‌బాబే! ఇన్ని ప‌నుల‌తో పాటు ఉగాది నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం అవుతున్నందున వీటికి సంబంధించి కూడా ఓ ప్ర‌క‌ట‌న ప్ర‌భుత్వం చేయ‌నుంది.దానిపై కూడా మాట్లాడాల్సింది అచ్చెన్న కాదు చంద్ర‌బాబే! ఒక‌వేళ అచ్చెన్న మాట్లాడినా కూడా అధినేత చంద్ర‌బాబు స్థాయిలో త‌న గ‌ళం వినిపించ‌లేరు. శాస్త్రీయ దృక్ప‌థంతో మాట్లాడాల్సిన అంశాల‌పై చంద్ర‌బాబు మాత్ర‌మే వివ‌రంగా చెప్ప‌గ‌ల‌రు.అలాంటిది ఆయ‌న లేకుండా స‌భా నిర్వ‌హ‌ణలో టీడీపీ భాగ‌స్వామ్యం అన్న‌ది చురుకైన రీతిలో ఉండ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని !