Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీనియ‌ర్లు త‌గ్గిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   19 March 2022 2:30 PM GMT
కాంగ్రెస్ సీనియ‌ర్లు త‌గ్గిన‌ట్లేనా?
X
కాంగ్రెస్ అధిష్ఠానంలో మార్పులు రావాల‌ని.. నాయ‌క‌త్వం మారాల‌ని.. పార్టీలో సంస్థాగ‌తంగానూ మార్పులు చేయాల‌ని హైక‌మాండ్‌పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నా ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు వెన‌క్కి త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తున్నారు. జీ-23 బృందంగా ఏర్ప‌డ్డ సీనియ‌ర్ నేత‌లు కాంగ్రెస్ అధిష్ఠానంపై మొద‌టి నుంచి అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటీవ‌ల అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ప‌రాజయాలు చెంద‌డంతో అధిష్ఠానంపై మ‌రోసారి సీనియ‌ర్లు మండిప‌డ్డారు. సంస్థాగ‌తంగా పార్టీలో మార్పులు జ‌ర‌గాల్సిందేన‌ని తెగేసి చెప్పారు. సీడ‌బ్ల్యూసీ స‌మావేశానికి ముందే ఈ సీనియ‌ర్ నేత‌లు గులాం న‌బి ఆజాద్ ఇంట్లో భేటీ అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ త‌దిత‌ర నేత‌లు పాల్గొన్న సీడ‌బ్ల్యూసీ స‌మావేశం వాడివేడిగా జ‌రిగింద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. పార్టీకి శాశ్వ‌త అధ్య‌క్షుడిని ఎన్నుకోవాల‌ని డిమాండ్ చేసిన జీ-23 నేత‌లు.. గాంధీ కుటుంబ నాయ‌కుల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. దీంతో పార్టీలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయోన‌న్న ఆస‌క్తి పెరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ సీనియ‌ర్ నేత‌లు త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తున్నారు.

జీ-23 బృందంలో భాగ‌మైన నాయ‌కులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో వేర్వేరుగా స‌మావేశమ‌య్యారు. మొద‌ట హ‌రియాణా మాజీ సీఎం భూపీంద‌ర్ సింగ్ రాహుల్ గాంధీతో భేటీ అవ‌గా.. త‌ర్వాతి రోజు సోనియా గాంధీని ఆజాద్ క‌లిశారు.

పార్టీలో నాయ‌క‌త్వ మార్పు కోసం మేం ప‌ట్టుబ‌ట్ట‌లేద‌ని, పార్టీ బ‌లోపేతానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాత్ర‌మే కోరామ‌ని ఈ భేటీల త‌ర్వాత భూపీంద‌ర్‌, ఆజాద్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. గాంధీ కుటుంబ స‌భ్యులు పార్టీ సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుని ఇత‌రుల‌కు పార్టీ ప‌గ్గాలు అందించాల‌ని జీ-23లో భాగ‌మైన క‌పిల్ సిబ‌ల్ ఇటీవ‌ల డిమాండ్ చేశారు. కానీ సోనియాతో భేటీ త‌ర్వాత ఆజాద్ అందుకు విరుద్ధ‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సోనియాను త‌ప్పుకోమ‌ని తాము అన‌లేద‌ని పేర్కొన్న ఆజాద్‌.. నాయ‌క‌త్వ మార్పుపై వ‌స్తున్న ఊహాగానాల‌ను కొట్టిపారేశారు. మ‌రోవైపు అసంతృప్త నేత‌ల‌ను దారికి తెచ్చుకోవ‌డం కోసం సోనియా ప్ర‌యత్నాలు మొద‌లెట్టార‌నే ప్ర‌చారం సాగుతోంది. అందులో భాగంగానే ఆజాద్‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని స‌మాచారం. ఈ భేటీ త‌ర్వాతే ఆజాద్ సోనియా నాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నించ‌డం లేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.