Begin typing your search above and press return to search.

ఈ సారన్నా కాంగ్రెస్ జాగ్రత్త పడుతుందా

By:  Tupaki Desk   |   8 March 2022 5:31 AM GMT
ఈ సారన్నా కాంగ్రెస్ జాగ్రత్త పడుతుందా
X
ఈ విషయంపైనే కాంగ్రెస్ నేతల్లో ఆలోచన మొదలైంది. ఎందుకంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో గోవాలో హంగ్ అసెంబ్లీ తప్పదని ఎగ్జిట్ పోల్స్ ద్వారా బయటపడింది. గోవాలో ఉన్న 40 సీట్లలో బీజేపీ-కాంగ్రెస్ కు చెరో 15 సీట్లు వస్తాయని తేలింది. మిగిలిన సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇండిపెండెంట్లు గెలుచుకుంటారు. మరి చెరిసగం సీట్లు రావటమే వాస్తవమైతే బీజేపీ ఊరుకుంటుందా ? అన్నదే కీలకమైంది.

ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో నిజానికి కాంగ్రెస్ కు 17 సీట్లు వస్తే బీజేపీకి వచ్చింది 13 సీట్లే. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. ఎలాగంటే ఇండిపెండెంట్లు లేదా మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ తమకే మద్దతిస్తారులే అనే నిర్లక్ష్యంతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.

దీన్ని అవకాశంగా తీసుకున్న కమలనాదులు వెంటనే రంగంలోకి దిగేసి అందరినీ మ్యానేజ్ చేసేశారు. మ్యానేజ్ చేయటంలో చివరకు కాంగ్రెస్ ఎంఎల్ఏలను కూడా వదల్లేదు.

ఈ కారణంగా అధికారం ఖాయమని కలలు కన్నా కాంగ్రెస్ చివరకు సొంత ఎంఎల్ఏలను కూడా కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి కాంగ్రెస్ నేతలు జాగ్రత్తులు తీసుకుంటున్నారు. ఇండిపెండెంట్లతో టచ్ లోకి వెళ్ళారు. ఎవరికి ఇవ్వాల్సిన హామీలను వాళ్ళకిచ్చి ఐదేళ్ళపాటు బీజేపీ ప్రభుత్వం చేసిన కంపును గుర్తు చేస్తున్నారట.

ఇండిపెండెంట్ కన్నా కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం ఏమిటంటే ఆప్. ఆప్ కు ఎన్ని సీట్లు వస్తే కాంగ్రెస్ కు అంత అడ్వాంటేజ్ అన్న విషయం తెలిసిందే. కారణం ఏమిటంటే ఎట్టి పరిస్ధితుల్లోను బీజేపీకి ఆప్ మద్దతు ఇవ్వదు. వేరే దారి లేనపుడు కాంగ్రెస్ కన్నా మద్దతిస్తుంది లేకపోతే తటస్తంగా ఉండిపోతుందంతే.

ఒకవేళ కాంగ్రెస్ కు మద్దతివ్వకుండా ఆప్ తటస్తంగా ఉండిపోతే కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ ఇబ్బందే. 21 సీట్లు దాటితే కానీ పార్టీ లేదా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. మరి కాంగ్రెస్, బీజేపీలు ఏం చేస్తాయో చూడాల్సిందే.