Begin typing your search above and press return to search.

చట్ట సభల అధికారాల మీద చర్చట... ?

By:  Tupaki Desk   |   5 March 2022 4:30 PM GMT
చట్ట సభల అధికారాల మీద చర్చట... ?
X
చట్ట సభలు అంటేనే చట్టాలు చేస్తాయని అర్ధం. మరి అవి ఏ చట్టాలు చేయకూడదు, ఏమి చేయాలీ అన్న దాని మీద అయితే క్లారిటీ లేదు. ఇక రాజ్యాంగంలో చూసుకుంటే కేంద్రానికి కొన్ని అధికారాలు, రాష్ట్రాలకు మరి కొన్ని అధికారాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో ఇంకొన్ని ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే రాజధాని వంటి వాటి మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని ఒక వాదనను వైసీపీ నేతలు లేవనెత్తుతున్నారు.

ఇదిలా ఉంటే అలాంటి అధికారమే ఉపయోగించుకుని గత చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధానిగా చట్టం చేసిందని అంటున్నారు. ఇపుడు దాన్ని మార్చే అధికారం శాసన సభకు ఎందుకు ఉండదు అన్నది కూడా లేవనెత్తుతున్న ప్రశ్న. ఇదిలా ఉంటే శాసన సభల అధికారం మీద ప్రత్యేక చర్చ జరగాలని సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేయడం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది.

శాసన వ్యవస్థలకు ఉన్న అధికారాలు ఏంటి, అవి చేయాల్సిన చట్టాలు ఏంటి అన్న దాని మీద చర్చ జరగాల్సిందే అని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు ధర్మాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లేఖ రాశారు. శాసన సభలో దీని మీద చర్చ జరగాలని, ఈ విషయల్లో ఉన్న అనేక సందేహాలకు కూడా పరిష్కారం కావాలని కోరుతున్నారు.

ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరో ప్రభుత్వం మార్చాలనుకుంటే అధికారం ఉంటుందా లేదా అన్నది కూడా చర్చినాలని ఆయన అంటున్నారు. తాను హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పిన ధర్మాన రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు శాసన, కార్యనిర్వాహణ, న్యాయ వ్యవస్థలకు అధికారాలు పరిధులు ఉన్నాయని చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో శాసన వ్యవస్థకు ఉన్న అధికారాలు ఏంటో చర్చ జరిపితేనే తెలుస్తుంది అని ఆయన అంటున్నారు. అదే గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను పునస్సమీక్షించే అధికారాలు, గత ప్రభుత్వాలు చేసిన చట్టాలను పరిశీలించి వీలుంటే కొత్త నిర్ణయాలు తీసుకునే హక్కు లేదన్న వాదన రాజ్యంగబద్ధంగా ఎంతవరకూ సరైనది అన్న చర్చ కూడా జరపాలని ఆయన అంటున్నారు.

తాను సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి దాకా ఎన్నో కీలకమైన పదవులు చేపట్టానని ఆయన పేర్కొంటూ హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలు పరిశీలించిన మీదట ఆవేదన కలిగింది అని ధర్మాన అన్నారు. ఇక శాసన సభకు ఉన్నవి ప్రజల సంక్షేమం కోసమని, అదే విధంగా ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అవసరమైన చట్టాలను తీసుకువచ్చే హక్కు రాజ్యాంగం శాసన వ్యవస్థలకు కలిగించిందని ధర్మాన అంటున్నారు. మొత్తానికి దీని మీద ప్రత్యేక చర్చకు ఆయన డిమాండ్ చేయడం ఇపుడు హాట్ టాపిక్ గానే చూడాలి. దీని మీద వైసీపీ సర్కార్ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.