Begin typing your search above and press return to search.

గంటా...రాజీనామా తంటా... ?

By:  Tupaki Desk   |   14 March 2022 9:31 AM GMT
గంటా...రాజీనామా తంటా... ?
X
విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తన రాజీనామా విషయం మీద పట్టుబడుతున్నారు. ఆయన విశాఖ ఉత్తరం నుంచి 2019 ఎన్నికల వేళ ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ వేవ్ లో కూడా నిలిచి గెలిచిన గంటా ఆ తరువాత ఎందుకో టీడీపీలో కలసి అడుగులు ముందుకు వేయలేకపోయారు.

ఈ నేపధ్యంలో ఆయన గత ఏడాది తనదైన శైలిలో రాజీనామా చేస్తూ అటు టీడీపీకి ఇటు వైసీపీకి ఇరకాటంలో పడవేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది అన్న వార్తలు గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చాయి. దాంతో అప్పుడే గంటా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు.

ఆయన మొదట ఫాక్స్ ద్వారా రాజీనామాని స్పీకర్ తమ్మినేని సీతారాం కి పంపించారు. ఆ తరువాత నేరుగా స్పీకర్ అఫీస్ కి రాజీనామా తన వారి దాకా పంపించారు. ఇక ఒకసారి స్వయంగా శ్రీకాకుళంలోని స్పీకర్ ఇంటికి వెళ్ళి మరీ తాను స్వచ్చందంగానే రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఇదంతా జరిగి ఏడాది అయినా గంటా రాజీనామా అలాగే పెండింగులో ఉంది. దాంతో ఈ మధ్యన గంటా వైపు నుంచి ఏమీ లేకపోవడంతో ఆయన రాజీనామా మీద వెనక్కి తగ్గారు అన్న మాట కూడా వచ్చింది. మరో వైపు టీడీపీతో కలసి ఆయన మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తారు అని కూడా అనుకున్నారు. ఈ మధ్య గంటా అలా యాక్టివ్ అయ్యారు కూడా.

అయితే ఇదే టైమ్ లో చంద్రబాబు ఏర్పాటు చేసిన మీటింగునకు గంటా తాను రాలేనని చెప్పడంతో మళ్లీ కధ మొదటికి వచ్చినట్లు అయింది. గంటా టీడీపీకి దూరమేనా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక గంటా వరసగా కాపు నేతలతో మీటింగులు నిర్వహిస్తున్నారు. ఆయన పొలిటికల్ అజెండా ఏంటో తెలియకపోయినా గంటా మాత్రం కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు అన్నది అర్ధమవుతోంది.

ఇదే క్రమంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గంటా అసలు ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆయన టీడీపీకి దూరమే అని భావిస్తున్న వేళ దాన్నే నిజం చేస్తున్నట్లుగా గంటా రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ కి లేటెస్ట్ గా లేఖ ఒకటి రాశారు.

తాను విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ గతేడాది ఫిబ్రవరిలో స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఏడాదికి పైగా ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదలకు చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాను చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్‌ను గంటా కోరారు.

మొత్తానికి చూస్తే గంటా రాజీనామా అంశం ఇపుడు స్పీకర్ వద్ద పెండింగులో ఉంది. దాన్ని ఆమోదించాలని గంటా వత్తిడి చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. అదే విధంగా టీడీపీని కూడా ఆయన పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. ఒక విపక్ష ఎమ్మెల్యే రాజీనామా చేతే క్షణాల్లో ఆమోదించవచ్చు. కానీ గంటా మెలిక పెట్టి రాజీనామా చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ చాలా సున్నితమైన అంశం. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీతో పాటు ఏపీలోని వైసీపీ మీద కూడా ఈ అంశం మీద వ్యతిరేకత ఉంది. ఇపుడు గంటా రాజీనామా ఆమోదించి ఆయన్ని హీరోని చేస్తే వైసీపీ సర్కార్ ఫుల్ గా కార్నర్ అవుతుంది. అందుకే అలా పెండింగులో పెట్టి ఉంచారు.

అయితే ఇపుడు లేఖ ద్వారా వత్తిడి పెడుతున్న గంటా తన రాజీనామా ఆమోదం కోసం ముందు ముందు ఏం చేస్తారు అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే. చూడాలి మరి ఏం జరుగుతుందో. తాజాగా రాసిన లేఖలో ఆయన స్టీల్ ప్లాంట్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు చేశారు. కాబట్టి ఆయన వైసీపీకి యాంటీ అని తేలిపోతోంది. మరి మూడవ పార్టీ వైపుగా ఆయన అడుగులు వేస్తారా అన్నదే చర్చ.