Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ కు సొంత వెన్నుముక లేదా? ఆవిర్భావ సభలో ఆ మాటేంది?

By:  Tupaki Desk   |   16 March 2022 8:30 AM GMT
పవన్ కల్యాణ్ కు సొంత వెన్నుముక లేదా? ఆవిర్భావ సభలో ఆ మాటేంది?
X
ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా తనకంటూ స్పష్టమైన ఆలోచనలు.. అభిప్రాయాలు ఉండాల్సిన అవసరం ఉంది. లక్షలాది మందిని ప్రభావితం చేసే అధినాయకుడికి విషయాల పట్ల స్పష్టత ముఖ్యం. జనసేన అధినేత పవన్ ఈ విషయంలో వెనుకబడ్డారు. తనకున్న లోపాన్ని ఆయనకు ఆయనే బయటపెట్టుకున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సోమవారం నిర్వహించిన జనసేన తొమ్మిదో ఆవిర్భావ సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. పలువురు మంత్రుల మీదా మండిపడటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. బీజేపీ పంపే రోడ్ మ్యాప్ ఆధారంగా నడుస్తామంటూ పవన్ నోటి నుంచి వచ్చిన మాట చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సభకు హాజరైన వేలాది మంది పవన్ నోటి నుంచి వచ్చిన మాటను అంత సీరియస్ గా తీసుకోనప్పటికి.. రాజకీయ వర్గాలు.. రాజకీయ విశ్లేషకులు.. మీడియాప్రతినిధులు మాత్రం.. పవన్ నోటి నుంచి వచ్చే మాటను అండర్ లైన్ చేసుకున్నారు.

ఒక భారీ బహిరంగ సభలో ఒక పార్టీ అధినేతగా వ్యవహరిస్తూ.. ఏపీలో తనకంటే తక్కువ ఓటు బ్యాంక్ ఉన్న రాజకీయ పార్టీ ఇచ్చే రోడ్ మ్యాప్ కు అనుగుణంగా తాను నడుచుకుంటానని చెప్పటం ద్వారా.. పవన్ తనకు తానే తగ్గించుకున్నారా? అంటే అవునని చెప్పాలి.

ఎందుకంటే.. ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా తనను తాను తక్కువ చేసుకునేలా.. మరో పార్టీ చెప్పినట్లుగా నడుచుకుంటానన్న మాటను చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు. ఎంత మిత్రపక్షమైనా.. పరస్పర సంప్రదింపులు ఉండాలే తప్పించి.. ఏకపక్షంగా తాను బీజేపీ చెప్పినట్లుగా నడుచుకుంటానని చెప్పటం.. పవన్ స్థాయికి ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలాంటివి ఇప్పటికిప్పుడు నష్టం కలిగించకున్నా.. భవిష్యత్తులో తిప్పలు తప్పవని చెప్పాలి. అన్నింటికి మించి.. ఈ తరహా వ్యాఖ్యలు విన్నప్పుడు పవన్ సమర్థత మీదా.. రాజకీయ పరిణితి మీదా కొత్త సందేహాలు రాక మానదు. బీజేపీ మీద ఆధారపడినట్లుగా చెప్పటం ఎంతవరకు సబబు? అన్నది ఒక ప్రశ్న అయితే.. వారిచ్చే రోడ్ మ్యాప్ కు అనుగుణంగా పవన్ నడవటం ఏమిటి? ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా తన ఫోకస్ మొత్తం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి మేలు జరిగేలా ఉండాలి.

ఈ విషయంలో అప్పుడప్పుడు జాతీయ పార్టీకి.. ప్రాంతీయ పార్టీకి మధ్య వైరుధ్యం ఉంుటంది. ఒక పార్టీకి ఫాలోయర్ మాదిరి.. మోడీషాల చేతిలో రిమోట్ మాదిరి పవన్ ఉండకూడదన్న విషయాన్ని ఆయన మర్చిపోకూడదు. అదే జరిగితే.. బీజేపీకి బీ టీమ్ గా జనసేన నిలుస్తుంది. అంతే తప్పించి.. సొంత బలమున్న పార్టీగా మారదు. ఈ విషయాన్ని పవన్ ఎప్పటికి గ్రహిస్తారు? అన్నది అసలు ప్రశ్న.