Begin typing your search above and press return to search.

వాట్సాప్ లో పోస్టు.. పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారుల పరుగులు

By:  Tupaki Desk   |   8 March 2022 4:43 AM GMT
వాట్సాప్ లో పోస్టు.. పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారుల పరుగులు
X
వాట్సాప్ లో వైరల్ గా మారిన ఒక పోస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాహనదారుల్ని పెట్రోల్ బంకులకు పరుగులు తీసేలా చేసింది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య నడుస్తున్న యుద్ధం పుణ్యమా అని.. ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవటం తెలిసిందే. యుద్ధం ఎంత కాలం కొనసాగుతుంది? అన్న దానిపై స్పష్టత లేకపోగా.. విపరీతమైన అనిశ్చితి సాగుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు ఎక్కడి వరకు వెళతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మరోవైపు భారీగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్.. డీజిల్ ధరలు మాత్రం పెరగలేదు. దీనికి కారణం ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలే. నిన్నటి (సోమవారం)తో యూపీలో జరగాల్సిన చివరి దశ పోలింగ్ కూడా పూర్తైంది. దీంతో.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని కేంద్రం భారీగా పెంచేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలుపెరగనప్పటికీ రోజువారీగా పదిపైసలు.. పావలా చొప్పున పెంచుకుంటూ పోయే మోడీ సర్కారు.. ముడిచమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో బాదుడు భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. లీటరు పెట్రోల్.. డీజిల్ మీద రూ.10 నుంచి రూ.15 పెంపు ఖాయంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

దీనికి సంబంధించిన పోస్టు ఒకటి వాట్సాప్ లో వైరల్ గా మారింది. ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం వెలువడుతుందని.. మంగళవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయన్న మాట సర్వత్రా వ్యాపించింది.

దీంతో సోమవారం సాయంత్రం నుంచి వాహనదారులు పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. పలు బంకుల వద్ద వాహనదారుల జాతర కనిపించింది. వాట్సాప్ లో సందేశం వైరల్ అయ్యే కొద్దీ.. పెట్రోల్ బంకుల వద్ద వాహనాల జోరు ఎక్కువైంది.

రాత్రి పది గంటల వేళలోనూ.. హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున నిలిచారు. లీటరకు పది చొప్పున వేసుకున్నా.. కార్లలో పెట్రోల్.. డీజిల్ పోయించుకునే వారికి లాభం కలుగుతుందన్న ఆశతో ఎక్కువ మంది పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు.