Begin typing your search above and press return to search.

పోలవరం మీటింగ్.. కదిలే చాన్సుందా... ?

By:  Tupaki Desk   |   22 Feb 2022 11:30 AM GMT
పోలవరం మీటింగ్.. కదిలే చాన్సుందా... ?
X
ఎప్పటి పోలవరం. ఎన్నాళ్ల వరం. మరెప్పటి కల. ఎన్ని దశాబ్దాల కలవరం. అలా మోస్తూ నానుస్తూ ముందుకు సాగుతున్న వేళ మరో కీలకమైన మీటింగ్ ఈ రోజు జరుగుతోంది. ఏ సమావేశం అయినా అది పోలవరానికి సంబంధించినది అయితే ఆసక్తి ఉంటుంది. ఆశ కూడా ఉంటుంది. పోలవరం అడుగు ముందుకు కదులుతుందేమో అన్న కోరిక కూడా మెదులుతుంది.

సీడబ్ల్యుసీ, కేంద్ర ఏపీ అధికారులతో పోలవరం విషయమే భేటీ అయ్యారు. వీడియో కాన్వరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ మీటింగ్ లో సంచలన నిర్ణయాలు ఏమైనా ఉంటాయా అన్న ఎదురు చూపులు ఎటూ ఉన్నాయి. ఇక పోలవరం మీటింగ్ అజెండా చూస్తే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, పనుల పురోగతి, నిధులు, పోలవరం పునరావాసం, నష్టపరిహారం సహా ప్రాజెక్ట్ ఇతర అంశాలపై చర్చ ఉంది.

ఇవన్నీ కూడా కావాల్సినవే. అవసరం అయినవే. అన్నింటికీ మించి పునరావాస ప్యాకేజి మీద ఎటూ తేలకుండా ఉన్న వైనాన్ని కూడా చర్చింది దాని మీద ఏమైనా నిర్ణయాలు జరుగుతాయా అన్న ఆశ కూడా ఉంది.

ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చాలా ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్న అత్యంత ప్రాధాన్యం కలిగిన డిజైన్లపై డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ గురించి కూడా కీలక చర్చ సాగుతోంది.2020లో గోదావరిలో 23లక్షల క్యూసెక్కుల వరద ఉధృతికి డయాఫ్రం వాల్‌ చుట్టూ ఏర్పడ్డ సుడుల కారణంగా భారీ గొయ్యి ఏర్పడింది. దానిని పూడ్చే ప్రక్రియపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో డీడీఆర్‌పీ భేటీ అవుతోంది అంటున్నారు.

డిజైన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటేనే తప్ప పనులు ముందుకు సాగవని నిపుణులు చెబుతున్న వేళ ఈ భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కేంద్రం పోలవరం విషయంలో షరా మామూలు సమావేశాలు జరిపి ఊరుకోకుండా కచ్చితంగా అడుగులు ముందుకు పడేలా జోరు చేయాలన్న డిమాండ్ అయితే ఉంది.

ఇలా రెగ్యులర్ గా అధికారుల స్థాయిలో జరిగే సమావేశాల వల్ల ఉపయోగం ఎంతవరకూ ఉంటుంది అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా పోలవరం విషయంలో భేటీ అంటే మాత్రం అటెన్షన్ కచ్చితంగా ఉంటుంది. ఆ దిశగా సానుకూల ఫలితాలు రావాలని అంతా గట్టిగా కోరుకుంటున్నారు.