Begin typing your search above and press return to search.

రాజమౌళి.. పీకేకు పోలికలు ఉన్నాయ్.. తరచి చూస్తే ఎన్నో!

By:  Tupaki Desk   |   2 March 2022 5:03 AM GMT
రాజమౌళి.. పీకేకు పోలికలు ఉన్నాయ్.. తరచి చూస్తే ఎన్నో!
X
ఏమన్నా మాట ఇదా? ఎక్కడ ప్రశాంత్ కిశోర్.. ఎక్కడ రాజమౌళి. ఏ మాత్రం సంబంధం లేని రెండు రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఎలా పోలుస్తారన్న సందేహం రావొచ్చు. కానీ.. దీన్ని అసాంతం చదివితే విషయం మీకే అర్థమవుతుంది. ఈ ఇద్దరి మధ్య సారూప్యత ఎంత ఎక్కువగా ఉంటుందో? చిత్ర పరిశ్రమలో ఇప్పుడు తిరుగులేని దర్శక ధీరుడు.. ప్లాప్ అన్న మాట ఎరుగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది జక్కన్న అలియాస్ ఎస్ఎస్. రాజమౌళి మాత్రమే. ఆయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ఏ సినిమా అయినా హిట్టే కానీ ఫట్ అన్నది లేదు.

కట్ చేస్తే.. పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ విషయానికి వద్దాం. పార్టీ ఏదైనా.. అధినేత మరెవరైనా.. ఆయన ఓకే చేసి.. ఒక రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తానని ఒప్పందం చేసుకున్న తర్వాత.. ఆయన సేవలు అందించిన పార్టీ పవర్ లోకి రాని పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అంటే లేదనే చెప్పాలి. అంటే.. పూర్తి అనిశ్చితి నెలకొన్న రెండు రంగాల్లో తిరుగులేని విజయాల ట్రాక్ రికార్డు ఇద్దరిలోనూ ఉండటం ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క అపజయం ఇద్దరిలోనూ కనిపించదు.

రాజమౌళి సినిమాలను జాగ్రత్తగా గమనిస్తే.. సినిమా మొత్తంగా చెప్పాలనుకునే మాట చాలా సింఫుల్. కానీ.. ఆ సింఫుల్ లైన్ చెప్పటానికి అనుసరించే కథనం మాత్రం చిక్కగా.. కమ్మటి కాఫీలా ఉంటుంది. తరచూ భావోద్వేగానికి గురయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రతి సన్నివేశంలో కాకున్నా.. ఎక్కువ సన్నివేశాల్ని చాలా క్లోజప్ లో.. ఒక మంత్రంగా చూపించే ధోరణి కనిపిస్తుంది.

ఇదే సమయంలో పీకే విషయానికి వస్తే..ఆయన ఏదైనా రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తే.. ఆ పార్టీని ప్రజలకు దగ్గర చేసేందుకు అనుసరించే లైన్ చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ.. చెప్పే విధానం మాత్రం.. భిన్నంగా చాలా ఆసక్తికరంగా.. వ్యూహాత్మకంగా సాగుతుంటుంది. తాను సేవలు అందించే పార్టీ విషయంలో ప్రజలు ఎమోషనల్ గా కనెక్టు అయ్యేలా ఆయన తీరు ఉంటుంది.

రాజమౌళి సినిమాలో విలన్ ఎప్పుడు అరవీర భయంకరంగా ఉంటాడు. అలాంటి వాడిని ఎదుర్కొనే హీరో చూసేందుకు సాదాసీదాగా ఉన్నప్పటికీ.. మనోబలంతో.. సంకల్పంతో విలన్ దుర్మార్గాలకు పాతర పెట్టేలా చేస్తుంటారు.

పీకే వ్యూహరచన చూస్తే.. ఆయన ఎవరైతే తన ప్రత్యర్థి అనుకుంటారో.. వారి విషయంలో ప్రజలు అత్యంత దుర్మార్గుడిగా.. ప్రజా కంఠకుడిగా.. ముద్ర వేసే నేర్పు కనిపిస్తుంటుంది. రాజమౌళి సినిమాలో ఎలా అయితే.. విలన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్న భావన సినిమా చూసే ప్రేక్షకుడికి బలంగా కలుగుతుందో.. అవసరమైతే కత్తి ఇస్తాం.. రీల్ విలన్ సంగతి చూస్తావా? అంటే.. మరో ఆలోచన లేకుండా అలానే అన్నట్లుగా ఎలా అయితే ట్రాన్స్ లోకి తీసుకెళతారో.. పీకే సైతం తాను చెప్పే ప్రత్యర్థిని ఎన్నికల్లో దారుణంగా ఓడించాలన్న కసిని తీసుకొచ్చేలా చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాజమౌళిలోనూ.. ప్రశాంత్ కిశోర్ పని తీరులోనూ ఒకేలాంటి తీరు కనిపిస్తాయి. కావాలంటే వారిద్దరి పని తీరును జాగ్రత్తగా గమనించండి.. ఇద్దరూ ఒకేలా అనిపించక మానదు.