Begin typing your search above and press return to search.

పబ్బుకు వెళితే గబ్బు లేపారా? రాడిసన్ ఉదంతంలో షాకింగ్ అంశం

By:  Tupaki Desk   |   5 April 2022 8:30 AM GMT
పబ్బుకు వెళితే గబ్బు లేపారా? రాడిసన్ ఉదంతంలో షాకింగ్ అంశం
X
పబ్బుకు వెళితే నేరమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో టాస్క్ ఫోర్సు పోలీసుల తనిఖీలు.. ఆ సందర్భంగా దొరికిన డ్రగ్స్ తో ఇప్పుడు కొత్త చర్చకు తెర లేచింది. తక్కువ మోతాదులో డ్రగ్స్ దొరకటం ఒక ఎత్తు అయితే.. పబ్ లో ఉన్న 148 మందిని (సిబ్బందితో సహా) పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లటం.. ఏడెనిమిది గంటల పాటు స్టేషన్ లో ఉంచి.. వివరాలు సేకరించి పంపించిన వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. డ్రగ్స్ తనిఖీల వేళ పబ్ లో ఉన్న వారి నుంచి సేకరించిన వ్యక్తిగత వివరాలు.. కొందరి ఆధార్ వివరాలు తాజాగా బయటకు రావటం కలకలం రేపుతోంది.

ఒక ప్రధాన మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పబ్ కు వెళ్లిన వారిని వివరాల్ని సేకరించిన పోలీసులు.. వారి ఇంటి అడ్రెస్సులు.. ఫోన్ నెంబర్లతోపాటు.. ఆధార్ నెంబర్లను కూడా తీసుకున్నారు. వీరికి సంబంధించిన వివరాలు బయటకు రావటంతో.. తమ ఆవేదనను సదరు మీడియా సంస్థకు ఫోన్ చేసిన పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. తమ వ్యక్తిగత వివరాలు బయటకు ఎలా వచ్చాయనివారు ప్రశ్నిస్తున్నారు.

డేటా చౌర్యం జరిగినా.. తమ వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం జరిగితే.. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వ్యక్తిగత వివరాల్ని గోప్యంగా ఉంచాలని.. అనుమానితులు కూడా కాని ఉదంతంలో ఏకంగా తమ వివరాలు పబ్లిక్ కు చేరటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా సదరు మీడియా సంస్థ వెల్లడించింది. అత్యుత్సాహంతో పోలీసులు తమ ఆధార్ నెంబర్లు.. మొబైల్ నెంబర్లను లీక్ చేసినట్లుగా వారు వాపోతున్నారు.

తమ ఫోన్ నెంబర్లు బయటకు రావటంతో పలువురికి ఫోన్లు వెళ్లటం.. వారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. కొందరికి ఎవరెవరో ఫోన్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా పబ్బుకు వెళితే గబ్బు పట్టిస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఆధార్ లాంటి సున్నితమైన వివరాల్ని బయటపెట్టటం.. చట్ట విరుద్దంగా నేరం అవుతుందన్న వాదన వినిపిస్తోంది.

మొత్తానికి పబ్ తనిఖీల ఉదంతం మరో కొత్త అంశంలోకి టర్న్ తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. పారదర్శకంగా వ్యవహరించే క్రమంలో కొన్ని వివరాలు బయటకు వస్తే.. దానికి ఇంత రచ్చ చేయటం సరికాదన్న మాట పోలీసు వర్గాలు పేర్కొంటున్నట్లుగా సదరు మీడియా సంస్థ తెలిపింది.

పోలీసుల్ని తప్పు పట్టొద్దన్న వాదనను పోలీసు అధికారులు తమ ప్రైవేటు సంభాషణల్లో అభిప్రాయపడుతున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. ఈ ఆరోపణలకు పోలీసులు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.