Begin typing your search above and press return to search.

#RussiaUkrainewar: బందీలుగా రష్యన్లు.. రష్యాలో మిన్నంటిని ఆందోళనలు

By:  Tupaki Desk   |   25 Feb 2022 5:30 AM GMT
#RussiaUkrainewar: బందీలుగా రష్యన్లు.. రష్యాలో మిన్నంటిని ఆందోళనలు
X
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు అనుకున్నది సాధించినా తాజాగా గట్టి షాక్ తగిలింది. పుతిన్ చర్యపై సొంత దేశ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో ప్రజలు రోడ్లెక్కారు. పుతిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురువారం రాత్రి సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ప్రధాన వీధి అయిన నెవ్ స్కీ ప్రోస్పెక్ట్ లో గుమిగూడిన చాలా మంది రష్యాన్ యువకులు గుంపుగా చేరి అధ్యక్షుడు పుతిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దేశంలోని అనేక నగరాల్లో వేలాది మంది రష్యన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వచ్చారు. యుద్ధానికి తాము వ్యతిరేకం అంటూ ప్లకార్డులు పట్టుకొని.. బ్యానర్లను ప్రదర్శించారు. పొరుగు దేశం ఆక్రమణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే సైన్యం తిరిగి రావాలంటున్నారు. ఉక్రెయిన్ మా శత్రువు కాదని.. రష్యా యుద్ధానికి వ్యతిరేకంటూ హోరెత్తిస్తున్నారు.

ఉక్రెయిన్ పై యుద్ధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటడంతో పుతిన్ ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. దేశంలోని 53 పట్టణాల్లో సుమారు 1700 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మాస్కోలోనే 900 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో 400 మంది నిరసనకారులను జైళ్లకు తరలించారు.

అంతకుముందు పలువురు జర్నలిస్టులు, మీడియా ప్రముఖులు రష్యా కార్యకలాపాలను ఖండిస్తూ ఓ పిటీషన్ పై సంతకం చేశారు. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్, సమారా, రియాజాన్, సహా ఇతర నగరాల నుంచి వందమందికి పైగా మున్సిపల్ డిప్యూటీలు రష్యా పౌరులకు బహిరంగ లేఖపై సంతకం చేశారు.

ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులంతా ఉక్రెయిన్ పై సైన్యం దాడిని ఖండించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఇది అసమానమైన దురాగతం అని.. దీనికి సమర్థన ఉన్నా ఈ హింసను సమర్థించకూడదు అని వెల్లడించారు.

రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు అనధికారికంగా బాంబుల వర్షం కురిపించినా.. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక యద్దం చేయడమేనని ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ పై దశాబ్దాలుగా ఆధిపత్యం కోసం పరితపిస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఆ దేశం పోరాడుతోంది. అయితే ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు అండగా ఉంటున్నాయి. ఈ మద్దతు పై రష్యా ఇంకా మండిపడుతోంది. ఇక యుద్ధం చేయడం తప్ప మరో మార్గం లేదనే విషయాన్ని పుతిన్ చెప్పడం ఆందోళన వాతావరణం ఏర్పడింది.