Begin typing your search above and press return to search.

కీవ్ లోని భారతీయులకు కేంద్రం అత్యవసర ప్రకటన

By:  Tupaki Desk   |   1 March 2022 10:39 AM GMT
కీవ్ లోని భారతీయులకు కేంద్రం అత్యవసర ప్రకటన
X
ఉక్రెయిన్ లో పరిస్థితులు అంతకంతకూ మారిపోతున్నాయి. తొలుత భారత పౌరులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకున్నా.. గడిచిన రెండు రోజులుగా వాతావరణం మారింది. భారత పౌరులపై అక్కడి అధికారులు.. భద్రతా సిబ్బంది ఇబ్బందులకు గురి చేయటం.. టార్చర్ చేయటం.. దెబ్బలు కొట్టటం లాంటివి చేస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. కేంద్రంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు.. వినతులు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఐక్య రాజ్య సమితిలో జరిగిన అత్యవసర సమావేశం ఓటింగ్ లో.. ఓటు వేయకుండా భారత్ బయటకు వచ్చింది. అనంతరం ఉక్రెయిన్ లో ఉన్న భారత పౌరుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా భారత ప్రభుత్వం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఉన్న భారత పౌరుల్ని ఉద్దేశించి కీలక ప్రకటన జారీ చేశారు. తక్షణమే కీవ్ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా బయటపడాలని పేర్కొన్నారు. కీవ్ నగరంలోనిభారత పౌరులు.. విద్యార్థులు తక్షణమే.. ఎలా అవకాశం ఉంటే అలా.. నగరం నుంచి బయటకు వచ్చేయాలన్న సూచన చేశారు.

దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని భారత రాయబార కార్యాలయం జారీ చేసింది. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం వైపునకు వెళ్లేందుకు కీవ్ లో రైళ్లు సిద్ధంగా ఉన్నట్లుగా ఎంబసీ నిన్న సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.

రైల్వే స్టేషన్లకు జనాలు భారీగా చేరుకోవచ్చని.. భారత పౌరులంతా సంయమనంతో వ్యవహరించాలని సూచన చేశారు. దేశాన్ని విడిచి పెట్టేందుకు తగిన పత్రాలు.. నగదును తమతో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆపరేషన్ గంగ పేరుతో ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల్ని.. విద్యార్థుల్ని తరలిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన ప్రత్యేక ట్విటర్ ఖాతాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మారుతున్న పరిణామాలకు అనుగుణంగానే రాయబార కార్యాలయం తాజా ప్రకటన చేసి ఉంటుందన్న అంచనా వేస్తున్నారు.