Begin typing your search above and press return to search.

జెలెన్ స్కీ..ప్రపంచానికి ఇప్పుడెందుకు హీరో అవుతున్నాడు?

By:  Tupaki Desk   |   2 March 2022 5:32 AM GMT
జెలెన్ స్కీ..ప్రపంచానికి ఇప్పుడెందుకు హీరో అవుతున్నాడు?
X
అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోవటం ఎక్కడైనా ఉన్నదే. విజయమో.. వీరస్వర్గమో అన్నది తేల్చుకోవాలని నూరిపోసే పాలకులు.. తీరా తన వరకు వచ్చాక.. తాను చెప్పింది మర్చిపోయి.. అందరి కంటే ముందుగా దేశాన్ని విడిచి పెట్టి పారిపోయే మొదటి వరుసలో దేశాధ్యక్షుడు ఉంటారు. ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు.. మరీ ముఖ్యంగా అనూహ్యమైన యుద్దాన్ని ఎదుర్కొన్న దేశాల్ని చూసినప్పుడు.. అప్పటివరకు గంభీరంగా కనిపించే దేశాధినేత.. సరిగ్గా యుద్ధం మొదలయ్యే సరికి దేశం నుంచి జంప్ అయిపోయి.. ఎక్కడో దూరాన ఏదో ఒక దేశంలో ఆశ్రయం పొందటం చూస్తుంటాం.

తాజాగా రష్యా -ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మాత్రం రోటీన్ కు భిన్నమైన సీన్ కనిపిస్తోంది. ఉక్రెయిన్ దేశాధినేత జెలెన్ స్కీను మట్టుబెట్టడానికి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఏకంగా 400 మందితో కూడిన టీంను పంపారని.. ఆయన్ను ఎప్పుడైనా..ఎక్కడైనా వేసేయొచ్చన్న మాట వినిపిస్తోంది.

ముప్పు ముంచుకొస్తుంటే.. భార్య పిల్లల్ని తీసుకొని విదేశాలకు పారిపోవటానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అందుకు భిన్నంగా జెలెన్ స్కీ మాత్రం తాను స్వదేశంలోనే ఉంటానని.. విజయమో.. వీరస్వర్గమో తేల్చుకుంటానని చెబుతున్నారు. అందుకే.. ఇప్పుడు అతగాడు.. ప్రపంచ దేశాలకు హీరో అయ్యాడు.

మరింత విచిత్రమైన విషయం ఏమంటే.. ఇప్పుడు జరుగుతున్న యుద్దంలో భారత్ ఎవరి వెంట ఉండాల్సిన అవసరం ఉంది? అన్న ప్రశ్నను వేసుకుంటే.. పలువురు మేధావులు.. యుద్ధ నిపుణులు.. చరిత్రకారులు చెప్పే దాని ప్రకారం రష్యా పక్షాన నిలవాలి. కాకుంటే.. తటస్థులమన్న కలర్ ఇవ్వాలని చెబుతారు. కానీ.. మీడియా కావొచ్చు.. దేశ ప్రజలు ఉక్రెయిన్ అధ్యక్షుడ్ని హీరోగా.. రష్యాను విలన్ గా భావించే పరిస్థితి. ఎందుకిలా? అంటే.. జెలెన్ స్కీ ప్రదర్శిస్తున్న స్థైర్యమే.

పుతిన్ లాంటి కరుడుకట్టిన దేశాధినేతతో కయ్యం పెట్టుకోవటానికి చాలానే దమ్ము ఉండాలి. అదంతా ఒక ఎత్తు అయితే..నమ్మిన సిద్ధాంతం తరఫున పోరు చేసే సమయంలో యుద్ధం ముంచుకొచ్చినా.. అధైర్యపడక.. ధైర్యంగా ఎదుర్కొంటున్న వైనం చాలా దేశాలకు ముచ్చటను కలిగిస్తోంది. మొన్నటికి మొన్న అఫ్గాన్ ఎపిసోడ్ చూస్తే.. ముందంతా బీరాలు పలికిన అష్రఫ్ ఘనీ.. తీరా తాలిబన్లు దూసుకొచ్చినంతనే.. చేతులెత్తేసి.. రాత్రికి రాత్రి దేశం విడిచి పారిపోవటం చశాం.

ఇలాంటి అష్రఫ్ ఘనీలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు. ఇలాంటివేళలో.. రష్యాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావటమే కాదు.. అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమన్నట్లుగా ఉన్న జెలెన్ స్కీ తీరు అందరిని ఆకర్షిస్తోంది. అదే ఆయన్ను.. ప్రపంచ దేశాల్లో హీరోగా మార్చింది.