Begin typing your search above and press return to search.

భారత్ కు రష్యా చమురు: అమెరికా వార్నింగ్

By:  Tupaki Desk   |   16 March 2022 9:36 AM GMT
భారత్ కు రష్యా చమురు: అమెరికా వార్నింగ్
X
ఉక్రెయిన్ పై రష్యా దాడులతో ఇప్పుడు ప్రపంచమంతా రెండు వర్గాలుగా విడిపోయింది. అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ వైపు.. చైనా, భారత్ లు రష్యా వైపు నిలబడ్డాయి.
ఈ క్రమంలోనే రష్యా చమురును అమెరికా సహా యూరప్ దేశాలు నిషేధించడంతో ఇప్పుడు భారత్ కు తక్కువ ధరకు అందించేందుకు రష్యా ఆఫర్ చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. భారత్ తటస్థ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

భారత్ ఆంక్షలు ఉల్లంగించినట్టు కాదని అమెరికా పేర్కొంది. అయితే ఈ నిర్ణయంతో భారత్ చరిత్రలో తప్పుడు వైపు ఉండొచ్చని హెచ్చరించింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో అమెరికా సహా ప్రపంచదేశాలు అనేక ఆంక్షలు విధించాయి. ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు చేసుకోరాదని అగ్రరాజ్యం నిర్ణయించింది. అయితే ఈ ఆంక్షలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా.. తమ దేశం నుంచి ముడిచమురును భారత్ కు డిస్కౌంట్ తో అమ్మాలని అనుకుంటున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపించాయి. ఇందుకు భారత్ కూడా అంగీకరించిందనే కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే భారత్ కు రష్యా చమురు ఆఫర్ పై అమెరికా వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకి స్పందించారు.‘రష్యా నుంచి డిస్కౌంట్ తో చమురు కొనుగోలు చేయడంలో ఆంక్షలను ఉల్లంఘించినట్టు కాదు.. అయితే అలాంటి చర్య చేపడితే చరిత్ర పుస్తకాల్లో భారత్ ఏ వైపున ఉంటుందన్నది తెలిసిపోతుంది. ఇప్పటికైనా భారత్ ఈ విషయంలో ముందుకెళితే తప్పుడునిర్ణయం తీసుకున్నట్టే. రష్యా నాయకత్వానికి మద్దతు ఇస్తున్నట్టేనని.. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని సమర్థిస్తున్నట్టేనని అమెరికా కార్యదర్శి తీవ్ర హెచ్చరికలు చేశారు.

ఇప్పటికే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని సమర్థించడం లేదని భారత్ ప్రకటించింది. ఈ విషయంలో ఇరుపక్షాలు చర్చలు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మాణాలకు మాత్రం భారత్ దూరంగా ఉంటూ వస్తోంది. రష్యా నుంచి భారత్ సైనిక పరికరాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్ తటస్థ వైఖరి పాటిస్తున్నట్టు బైడెన్ యంత్రాంగం ఇప్పటికే చాలాసార్లు అభిప్రాయపడింది.

ఇక దశాబ్ధాలుగా భారత్ కు రష్యా నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. భారత దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం రష్యా నుంచే ఎక్కువ వాటాలో రక్షణ పరికరాలను ఇండియా కొనుగోలు చేస్తోంది.