Begin typing your search above and press return to search.

బయో వార్.. కనిపించని శత్రువుతో యుద్ధం..!

By:  Tupaki Desk   |   5 March 2022 10:46 AM GMT
బయో వార్.. కనిపించని శత్రువుతో యుద్ధం..!
X
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరు దేశాల సైన్యాలు బలంగా ఢీకొంటున్నాయి. ఈ నేపథ్యంలో బయోవార్ తెరపైకి వచ్చింది. జీవాయుధాలతో జరిపే యుద్ధాన్ని బయోవార్ అంటారు. రష్యా బయోవార్ కు సిద్ధమవుతోందని అమెరికా ఆరోపిస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేసే క్రమంలో అంతా వినాశనం అవుతుంది. బయో వార్ అంటే ఏమిటి? జీవాయుధాలు ఎలా వినియోగిస్తారు..!

శత్రు దేశంపై ఒక్క తూటా పేల్చకుండా... ఒక్క బాంబు విసరకుండా విధ్వంసం సృష్టించడానికి జీవాయుధాలను ఉపయోగిస్తారు. ఎటువంటి చడీచప్పుడు లేకుండా పని కానిచ్చేస్తారు. అత్యంత ప్రమాదకరమైన వైరస్, బ్యాక్టిరియా, ఫంగస్ లను ల్యాబుల్లో సృష్టిస్తారు. వాటిలో ప్రమాదకర గుణాలు ఇంకా వృద్ధి చెందేలా ప్రయోగాలు చేపడుతారు. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు.

అనంతరం టార్గెట్ ఉన్న దేశాలపై వీటిని ప్రయోగిస్తారు. ఉక్రెయిన్ పై ఓ వైపు బాంబుల మోత మోగుతోంది. మరోవైపు జీవాయుధ యుద్దానికి కుట్రలు జరుగుతున్నాయని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది. అంతర్జాతీయ విశ్లేషకులు సైతం ఇందుకు మద్దతు తెలపడం గమనార్హం.

అమెరికా ఆరోపణలపై రష్యా కూడా స్పందించింది. ఉక్రెయిన్ లో అమెరికా రహస్యంగా బయో వెపన్స్ తయారు చేస్తోందని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ లో అమెరికా రాయబారి కూడా ఇటీవలె ఐరాసలో ఈ బయో వార్ గురించి ప్రస్తావించారు. ఫలితంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ తరఫున అమెరికా లేదా రష్యా జీవాయుధ యుద్ధాలకు పాల్పడుతాయా? అనే ఆందోళన ఒక్క సారిగా ఉద్ధృతమయ్యాయి.

ప్రపంచంలో ముఖ్యమైన ల్యాబుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయోగశాల కూడా ఒకటి అని సమాచారం. ది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ.. అనే ల్యాబ్ పుతిన్ కు చెందినదేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో చిన్న చిన్న రోగాలకు కారణమయ్యే సూక్ష్మజీవుల నుంచి అత్యంత ప్రమాదకరమైన వైరస్, బ్యాక్టిరియాలు ఉన్నాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. మానవాళికి అత్యంత ప్రాణాంతకమైన వైరస్ లు వంటివి ఉంటాయని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ జీవాయుధాల్ని వాడటం నిషేధించాలని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ది బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ (బీడబ్లూసీ)పై సంతకాలు చేశాయి. 1975లో ఇది అమల్లోకి వచ్చాయి. జీవాయుధాలు తయారు చేయడం, ఉపయోగించడం నిషేధిస్తూ తీర్మానం చేశాయి. 2022 నాటికి 183 దేశాలు సంతకాలు చేయగా... పది దేశాలు ససేమిరా అన్నాయి. అయితే సంతకాలు చేసిన దేశాల్లో రష్యా కూడా ఒకటి. అయితే ఈ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. అయితే దీనికి వ్యతిరేకంగా అమెరికానే చేస్తోందని రష్యా కూడా అంటోంది.