Begin typing your search above and press return to search.

రష్యా చేతిలో న్యూక్లియర్ ప్లాంట్: ఆందోళనలో ఉక్రెయిన్

By:  Tupaki Desk   |   10 March 2022 4:51 AM GMT
రష్యా చేతిలో న్యూక్లియర్ ప్లాంట్: ఆందోళనలో ఉక్రెయిన్
X
ఉక్రెయిన్ పై రష్యా దాడితో ఆ దేశ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే ఉక్రెయిన్లోని ప్రధాన నగరాల్లోని కీలక భవనాలను పేల్చివేసింది రష్యా. దీంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా దేశంలో అత్యంత కీలకంగా ఉన్న చెర్నొబిల్ న్యూక్లియర్ పై కూడా బాంబులు వేసినట్లు ఆ దేశం తెలుపుతోంది. ప్రస్తుతానికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విషయంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని అటామిక్ ఏజెన్సీకి ఉక్రెయిన్ ఓ నివేదిక ఇచ్చింది.

చెర్నోబిల్ ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ సంబంధాలు పూర్తిగా తొలిగిపోయాయని, రాను రాను పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని ఈ నివేదికలో పేర్కొంది. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన వాతావరణం ఏర్పడింది. ఉక్రెయిన్ న్యూక్లియర్ ను ధ్వంసం చేస్తే ప్రపంచ దేశాలపై ఈ ప్రభావం ఉంటుందని అంటున్నారు. అయితే ఉక్రెయిన్లోని న్యూక్లియర్ ప్లాంట్ ను ధ్వంసం చేసే ఆలోచన తమకు లేదని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది.

అయితే తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కలేబా ట్విట్టర్ ద్వారా ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్ ప్లాంట్ కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆగిపోయిందన్నారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్ కు అందిన సమాచారం ప్రకారం. చెర్నోబిల్లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు.

అత్యవసర పరిస్థితుల కోసం జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇది కేవలం 48 గంటలు మాత్రమే పనిచేస్తుందన్నారు. ప్లాంట్ కు విద్యుత్ సరఫరా లేకపోతే న్యూక్లియర్ మెటీరియల్ ను చల్లార్చే వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ క్రమంలో రేడియేషన్ ను నియంత్రించడం చేయకపోతే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు.

అయితే ఉక్రెయిన్ చేస్తున్న ఆరోపణలన్నీ తప్పని రష్యా ఆరోపించింది. ఇప్పటికీ రష్యా ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదన్నారు. న్యూక్లియర్ పై ఎలాంటి దాడులు చేయలేదని తెలిపింది. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కోరుకుంటున్నామని, ఉక్రెయిన్ దేశం అనవసరంగా ఆరోపిస్తోందని రష్యా విదేశాంగ ప్రతినిధిని మరియా జఖరోవా తెలిపారు. బుధవారం రష్య, ఉక్రెయిన్ల మధ్య మూడో దఫా చర్చల సంద్భంగా మారియా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇప్పటికే తాము నాటోలో చేరమని ఉక్రెయిన్ దేశాధినేత స్పష్టం చేయడంతో రష్యా సైతం శాంతించినట్లు తెలుస్తోంది. అయితే బుధవారం జరిగిన చర్చల అనంతరం అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. మరో వైపు రష్యా శరణార్థులను తమ స్వదేశాలకు శరవేగంగా పంపిస్తోంది. బస్సులు, రైళ్ల ద్వారా స్వదేశానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. ఓ వైపు చర్చలు సాగుతుండగా.. మరోవైపు శరణార్థులను పంపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.