Begin typing your search above and press return to search.

టీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ.15 కోట్ల సుపారీ.. సీపీ ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   3 March 2022 4:32 AM GMT
టీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ.15 కోట్ల సుపారీ.. సీపీ ఏం చెప్పారు?
X
అనూహ్యంగా తెర మీదకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందన్న ఉదంతంపై సంచలన వివరాల్ని వెల్లడించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. మంత్రి హత్యకు భారీ కుట్ర జరిగితే.. దాన్ని చాకచక్యంగా భగ్నం చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ హత్య కుట్రలో ఎనిమిది మంది నిందితులకు సంబంధం ఉందని.. ఢిల్లీ.. హైదరాబాద్ లలో అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు. రోటీన్ కు భిన్నంగా బుధవారం రాత్రి 8.30 గంటల వేళలో అత్యవసర మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందించారు. కానీ.. రాత్రి 9.15 గంటల వేళలో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఈ సంచలన కేసుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. సీపీ సీఫ్టెన్ రవీంద్ర ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

- ఫిబ్రవరి 23న పేట్‌బషీరాబాద్‌ పరిధిలో సుచిత్ర వద్ద ఓ లాడ్జిలో ఫరూక్‌, హైదరాలీ అనే ఇద్దరు వ్యక్తులు దిగారు. 25న మధ్యాహ్నం రెండింటికి ఆ ఇద్దరు సుచిత్ర సెంటర్‌కు వచ్చారు. అదే సమయంలో నాగరాజు అనే వ్యక్తితో పాటు మరికొంతమంది కత్తులు, ఇతర మారణాయుధాలతో ఫరూక్‌, హైదరాలీని చంపడానికి వెంటపడ్డారు. గమనించిన ఇద్దరు వారి నుంచి తప్పించుకొని పరారయ్యారు.

- దేరోజు సాయంత్రం 5గంటలకు ఆ ఇద్దరూ ఘటనపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మరుసటి రోజే నాగరాజు సహా ఇతర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది.

- మహబూబ్‌నగర్‌కు చెందిన మార్కెట్‌ చైర్మన్‌ అమరేందర్‌ రాజు, ఆయన సోదరులు రాఘవేంద్రరాజు, మధుసూదన్‌రాజు, నాగరాజు, మున్నూర్‌ రవి కలిసి మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ హత్యకు ప్లాన్‌ చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం విచారణలో నాగరాజే చెప్పాడు. అమరేందర్‌ రాజు, రాఘవేంద్రరాజు, మధుసూదన్‌ రాజు, మున్నూర్‌ రవి డిల్లీలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో తలదాచుకున్నట్లు చెప్పాడు.

- దీనికి సంబందించిన సాంకేతిక ఆధారాల్ని సేకరించిన పోలీసులు నిందితులు ఢిల్లీలో ఉన్నట్లుగా గుర్తించారు. నిందితులకు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ తాప, ఆయన పీఏ రాజు ఆశ్రయం కల్పించినట్లు తేలింది. వెంటనే పోలీసుల బృందం డిల్లీకి వెళ్లి వారిని గుర్తించి అరెస్టు చేసి హైదరాబాద్‌కు తెచ్చారు. వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లు. 8 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారిస్తే.. తామంతా కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్యకు కుట్ర పన్నినట్లుగా పేర్కొన్నారు.

- మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ను హత్య చేయడానికి ఫరూక్‌ అనే వ్యక్తికి రూ.15 కోట్లు సుపారీ ఇచ్చినట్లు చెప్పారు. ఆ డబ్బు ఇవ్వడానికి మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు ముందుకొచ్చినట్లు విచారణలో తేలింది. అయితే మంత్రి హత్యకు ప్లాన్‌ చేసిన విషయం బయటకు రావొద్దని ఫరూక్‌కు గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. కానీ ఫరూక్‌ తన స్నేహితుడు హైదరాలీకి విషయం చెప్పాడు. సుపారీ ఇచ్చిన నలుగురికి అనుమానం వచ్చిందని నిందితులు తెలిపారు. విషయం బయటకు వస్తుందన్న ఆలోచనతో ఫరూక్‌ను, హైదరాలీని చంపేయాలని నాగరాజుకు పురమాయించారు.

- ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నిందితుల్ని ఢిల్లీలో అరెస్టు చేసిన వేళలో.. సైబరాబాద్ పోలీసులు ఢిల్లీ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న ప్రశ్నకు సీపీ సమాధానమిస్తూ.. తర్వాత సమాచారం ఇచ్చామన్నారు. మంత్రి హత్యలో మాజీ మంత్రులు డీకే అరుణ.. జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నయన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిస్తూ.. విచారణలో తేలుతుందన్నారు.

- ఇంతకీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ఎందుకు ప్లాన్ చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి వస్తున్న సమాధానం ఏమంటే.. 2018 ఎన్నికలకు ముందు మహబూబ్‌నగర్‌లో శ్రీనివా్‌సగౌడ్‌ ఇంటి సమీపంలో ఒక కౌన్సిలర్‌పై జరిగిన హత్యాయత్నం నుంచి రాఘవేందర్‌రాజుకు, శ్రీనివా్‌సగౌడ్‌ శిబిరానికి మధ్య విబేధాలు మొదలయ్యాయన్నది వాదన. అనంతరం ఎన్నికల వేళలో శ్రీనివాస్ గౌడ్ తన ఎన్నికల అఫిడవిట్ ను ట్యాంపరింగ్చేసినట్లుగా రాఘవేంద్రర్ రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. రాఘవేందర్ రాజు సోదరుడు అమరేందర్ రాజు మార్కెట్ ఛైర్మన్ అయ్యేంతవరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో బాగానే ఉన్నా.. ఆ తర్వాత దూరమయ్యారంటున్నారు. మొత్తంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కు కుట్ర చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.