Begin typing your search above and press return to search.

ఒక కేసీఆర్.. ఇద్దరు పీకేలు.. కొత్త సమీకరణాలు షురూ?

By:  Tupaki Desk   |   2 March 2022 8:30 AM GMT
ఒక కేసీఆర్.. ఇద్దరు పీకేలు.. కొత్త సమీకరణాలు షురూ?
X
సాధారణంగా ఎన్నికలకు ఏడాది ముందుగా రాజకీయ వేడి రగులుకుంటుంది. కానీ.. ఇటీవల కాలంలో మాత్రం అందుకు భిన్నంగా ఎన్నికలకు రెండేళ్ల ముందే వాతావరణం పూర్తిగా మారిపోతోంది. చివరి ఆర్నెల్లను పక్కన పెడితే.. మిగిలిన ఏడాదిన్నరను క్రమపద్దతిలో పని చేస్తేనే అధికారం సొంతం అవుతుందన్న లెక్కల్ని ఈ మధ్యన రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. ఈ కారణంతోనే.. ఐదేళ్లు పాలించే అవకాశం ఉన్న అధికార పార్టీలు మూడేళ్లు మాత్రమే పాలన మీదా.. చివరి రెండేళ్లు పోల్ మేనేజ్ మెంట్ మీదా ఫోకస్ చేస్తుందని చెప్పాలి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంగా అటు దేశ రాజకీయాలతో పాటు.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మారాయని చెప్పక తప్పదు.

ఒకప్పుడు కేసీఆర్ నోటి నుంచి.. పవన్ కల్యాణా? ఎవరతను? అనే స్థాయి నుంచి.. తాను కాలేజీ చదివే రోజుల్లో తొలిప్రేమ సినిమాను చూసినోడ్నే అంటూ.. కేసీఆర్ కొడుకు కమ్ మంత్రి కేటీఆర్ నోటి నుంచి రావడం చూసినప్పుడు.. పవన్ కల్యాణ్ అనేటోడు కేసీఆర్ అభివర్ణించిన చిన్నోడేమీ కాదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు.. ఇప్పుడు కేసీఆర్ కు పవన్ కల్యాణ్ కూడా క్లోజే అన్న భావన రెండు పార్టీలకు ఉందని చెప్పాలి. దీనికి నిదర్శనంగా.. పీకే తాజా మూవీ భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా విజయవాడలోని థియేటర్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలువెత్తు కటౌట్ ను ఏర్పాటు చేయటం.. అది కాస్తా సంచలనంగా మారటం తెలిసిందే.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మంత్రి కేటీఆర్ హాజరు కావటం.. పవన్ ను కీర్తించటం.. పవన్ మూవీ విడుదల వేళలో.. అధికారికంగా ఐదు షోలు వేసుకోవటానికి అనుమతిని ఇచ్చేసి.. బెనిఫిట్ షో పేరుతో ఫ్యాన్స్ వేసే ఆరో షో పడినా.. పట్టించుకోని తీరు చూస్తే.. పవన్ కు కేసీఆర్ కు మధ్య అనుబంధం మరింత చిక్కగా మారిందన్న భావన కలుగక మానదు. ఇప్పుడు కేసీఆర్ కు ఇద్దరు పీకేలు సన్నిహితులుగా మారిపోవటం గమనార్హం. ఈ ఇద్దరు పీకేల పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలకు తెర లేస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇప్పుడు తన రాజకీయ వ్యూహకర్తగా పీకే (ప్రశాతంత్ కిశోర్)ను నియమించుకుంటే.. మరో పీకే (పవన్ కల్యాణ్)కు ఇటీవల కాలంలో చాలా సన్నిహితంగా మారినట్లుగా తెలుస్తోంది. పొలిటికల్ గా పీకేను వాడేసి.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను మరోసారి అధికారపక్షంగా అవతరించేందుకు తగిన ప్లాన్ ను సిద్ధం చేయాలన్న టాస్కును ఇవ్వటం తెలిసిందే. ఇలా పొలిటికల్ పీకేను మాగ్జిమం వాడేస్తున్న కేసీఆర్.. మరోవైపు సినీ పీకేను సైతం వాడటం షురూ చేశారని చెప్పాలి. పీకేకు తాము సన్నిహితులమన్న భావన కలిగేలా చేయటం కోసం.. తమ డ్రైవర్లను.. కీలక అధికారులను ఇచ్చి మరీ.. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు పంపుతున్న తీరు.. ప్రాజెక్టులను గమనించాలని కోరుతున్న వైనం చూస్తే.. పీకేను కేసీఆర్ ఒక రేంజ్లో వాడేస్తున్నారని చెబుతున్నారు.

మరోవైపు.. పవన్ కల్యాణ్ కు దగ్గర కావడం ద్వారా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. జగన్ గెలుపులో కేసీఆర్ వాటా ఎంతన్న విషయం తెలుగు ప్రజలకు తెలియంది కాదు. అలాంటిది.. తనకు భిన్నంగా జగన్ అడుగులు ఉండటాన్ని భరించలేని కేసీఆర్.. తన బాటలో నడిచే పవన్ ను ముందుకు నడిపే ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. తాను అనుకున్నట్లే జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. ఏపీలో ఎవరు ప్రభుత్వంలో ఉండాలన్న విషయం మీదా కేసీఆర్ కు కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెబుతున్నారు. తాను అనుకున్నట్లుగా జరగటానికి పవన్ కల్యాణ్ ఒక అస్త్రంగా వినియోగిస్తారని చెబుతున్నారు.

పవన్ ను కేసీఆర్ వాడేస్తారన్న వాదన వినిపిస్తున్న వేళలో.. అందుకు భిన్నంగా కేసీఆర్ ను పవనే వాడేసే ఛాన్సు ఉందా? అన్నది ప్రశ్నే. పవన్ కేసీఆర్ ను వాడే కన్నా.. కేసీఆరే పవన్ ను వాడే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఇద్దరు పీకేలను కేసీఆర్ ఒక రేంజ్ లో వాడేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. అందులో నిజం ఎంతన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.