Begin typing your search above and press return to search.

టెంపర్డ్ గ్లాస్ అని చులకనొద్దు.. మార్కెట్ తెలిస్తే అవాక్కే!

By:  Tupaki Desk   |   30 May 2022 2:30 AM GMT
టెంపర్డ్ గ్లాస్ అని చులకనొద్దు.. మార్కెట్ తెలిస్తే అవాక్కే!
X
చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా.. పేద.. ధనిక అన్న తారతమ్యం లేకుండా ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరైంది. మొన్నటి వరకు మామూలు ఫోన్ వాడినోళ్లు సైతం స్మార్ట్ ఫోన్లోకి వేగంగా వచ్చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించి సాదాసీదా ఫోన్లను ఎవరూ వాడని పరిస్థితి.

ఈ ఫోన్లకు ఉండే స్క్రీన్లను కాపాడుకోవటానికి వేసుకునే టెంపర్డ్ గ్లాస్ కు సంబంధించిన లెక్కలు తెలిస్తే నోట మాట రాదంతే. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కు రక్షణగా నిలిచే ఈ టెంపర్డ్ గ్లాస్ కు సంబంధించిన మార్కెట్ అవకాశాలు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం కీలకం కానున్నట్లు చెబుతున్నారు.

తాజాగా ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వారి తాజా నివేదికను చూస్తే.. 2025 నాటికి 95.1 కోట్ల టెంపర్డ్ గ్లాసులు అవసరమని తేల్చింది. దీనిమార్కెట్ విలువ ఏకంగా రూ.20,300 కోట్లుగా చెబుతున్నారు. దేశీయ మార్కెట్ ను పెంచుకోవటంతో పాటు నాణ్యమైన టెంపర్డ్ గ్లాస్ లను ఉత్పత్తి చేయటం ద్వారా ఎగుమతుల్ని కూడా పెంచుకునే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికి సరైన బ్రాండెడ్ తయారీదారులు లేకపోవటం.. ఈ రంగానికి ఒక పెద్ద మైనస్ పాయింట్ గా చెబుతున్నారు.

ఎప్పుడైతే టెంపర్డ్ గ్లాస్ కు బ్రాండెడ్ తయారీదారులు రంగంలోకి దిగితే.. ఈ మార్కెట్ మరింత మెరుగుదల సాధిస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మార్కెట్ 90 శాతం అసంఘటిత రంగంలోనే సాగుతుందని చెబుతున్నారు. టెంపర్డ్ గ్లాస్ ను తప్పనిసరి రిజిస్ట్రేషన్ ఆర్డర్ వ్యవస్థలోకి తీసుకొస్తేనే నాణ్యత పెరగటంతో పాటు.. సరైన ప్రమాణాలు వస్తాయని చెబుతున్నారు.

దేశీయంగా నాసిరకం టెంపర్డ్ గ్లాస్ అమ్మకాలు సాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అంతేకాదు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటే.. ఈ భారీ మార్కెట్ మన సొంతం కావటంతో పాటు.. విలువైన మారక ద్రవ్యాన్ని కాపాడుకునే వీలుంది.

అంతేకాదు.. నాణ్యత ప్రమాణాలు పాటిస్తే.. ఎగుమతులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు తెలిసిందా.. మొబైల్ స్క్రీన్ మీద ఉంటే టెంపర్డ్ గ్లాస్ ను తేలిగ్గా అస్సలు తీసుకోకూడదని.