Begin typing your search above and press return to search.

7 నుంచి తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు.. గవ‌ర్న‌ర్‌కు షాకిచ్చిన స‌ర్కారు!

By:  Tupaki Desk   |   28 Feb 2022 6:30 PM GMT
7 నుంచి తెలంగాణ  బ‌డ్జెట్ స‌మావేశాలు.. గవ‌ర్న‌ర్‌కు షాకిచ్చిన స‌ర్కారు!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కు మ‌ధ్య పొస‌గ‌డం లేద‌నే విష‌యం తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్‌తో ఆదిలో బాగానే ఉన్న కేసీఆర్.. బీజేపీకి వ్య‌తిరేక స్టాండ్ తీసుకున్న నాటి నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నారు.

గ‌వ‌ర్న‌ర్ పాల్గొనే కార్య‌క్ర‌మాల‌కు ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ డుమ్మా కొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ క్ర‌మంలో కేసీఆర్ ఏకంగా.. బ‌డ్జెట్ స‌మావేశాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించ‌రాద‌ని నిర్ణ‌యించారు. నిజానికి కేసీఆర్ ఇలా చేయ‌డానికి ఒక టెక్నిక‌ల్ మిస్టేక్ కూడా క‌లిసి రావ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి బ‌డ్జెట్ స‌మావేశాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను పిల‌వ‌డం లేద‌ని అధికారికంగా తెలిసింది.

మార్చి 7 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు కోసం అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రగతిభవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, అందుబాటులో ఉన్న ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

శాసనసభ, మండలిని సమావేశ పర్చాల్సిన తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాల్సి ఉంది. ఆ లోగా ఉభయ సభలు పద్దుకు ఆమోదం తెలపాల్సి ఉండగా.. మార్చి 7 నుంచి సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

6న ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశంలో పద్దుకు అమాత్యులు ఆమోదం తెలుపనున్నారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు సమాచారం ఇచ్చారు. అయితే గత ఏడాది అక్టోబర్ 8న జరిగిన శాసనసభ, మండలి సమావేశాలు ప్రొరోగ్‌ కానందున.. వాటికి కొనసాగింపుగా ఈసారి జరగనున్నాయి. అందువల్ల గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.