Begin typing your search above and press return to search.

వంశీని మాజీని చేసేందుకు పక్కా వ్యూహం...?

By:  Tupaki Desk   |   5 March 2022 7:29 AM GMT
వంశీని మాజీని చేసేందుకు పక్కా  వ్యూహం...?
X
విజయవాడ నడిబొడ్డు. టీడీపీకి కంచుకోట లాంటి సీటు నుంచి ఆ పార్టీకి వ్యతిరేకంగా బిగ్ సౌండ్ చేసిన వల్లభనేని వంశీ అంటే పసుపు పార్టీ మండిపోతోంది. తమ పార్టీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు పలకడం ఒక పెద్ద తప్పు అయితే అక్కడ నుంచి ఏకంగా చంద్రబాబును, లోకేష్ బాబుని టార్గెట్ గా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కూడా అసలు తట్టుకోలేకపోతోందిట. ఎన్నికలు ఎపుడు జరిగినా కూడా రెబెల్ వంశీని ఇంటికి పంపించి తీరాల్సిందే అని టీడీపీ హై కమాండ్ పక్కాగా డిసైడ్ అయింది.

దీంతో వల్లభనేని వంశీ పోటీ చేసిన గన్నవరం సీట్లో ఆయన్ని ఢీ కొట్టే సరైనోడు కోసం వేట స్టార్ట్ చేసింది. ఇక గన్నవరం హిస్టరీ కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. గన్నవరంలో ఇప్పటికి అయిదు సార్లు టీడీపీ గెలిచింది. బలమైన నేతలు ఎందరో అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రత్యేకించి కమ్మ కులస్తులు ఎక్కువగా ఇక్కడ ఉంటారు. వారు ఎపుడూ అక్కడ టీడీపీని గెలిపించుకుంటారు.

అలాంటి సీట్లో ఇప్పటికి రెండు సార్లు వంశీ గెలిచారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే తొమ్మిది వేల పై చిలుకు మెజారిటీ దక్కింది. ఇక 2019లో జగన్ వేవ్ ని తట్టుకుని గెలిచినా మెజారిటీ మాత్రం 990 మాత్రమే వచ్చింది. ఇక వంశీ గెలిచిన తరువాత వైసీపీ వైపు మళ్లారు. ఆ పార్టీకి మద్దతుదారుగా ఉంటూ చంద్రబాబు, చినబాబుల మీద వరసబెట్టి విమర్శలు చేస్తూ వచ్చారు.

ఈ పరిణామాల క్రమంలో ఆయన ఏకంగా లోకేష్ మీద ఆ మధ్య చేసిన దారుణమైన ఆరోపణలతో టీడీపీ మండిపోతోంది. ఎట్టిపరిస్థితుల్లో వంశీకి గుణపాఠం చెప్పాలని చూస్తోంది. దాని కోసం ఇప్పటి నుంచే అభ్యర్ధిని నిర్ణయించి బరిలోకి దింపితే ఎన్నికల వేళకు గెలుపు చాన్స్ బాగా ఉంటుంది అని లెక్కలు వేస్తోంది. ప్రస్తుతం విజయవాడ తూర్పు నుంచి గెలిచిన గద్దే రామ్మోహన్ అయితే విజయం ఖాయమని భావిస్తోంది. ఆయన 1994లో ఇక్కడ నుంచి గెలిచి సత్తా చాటారు.

అయితే ఆయన తూర్పులోనే ఉంటాను అంటున్నారుట. దాంతో ఒకవేళ ఆయన కాకపోతే రెండు సార్లు ఇదే సీటు నుంచి గెలిచిన దాసరి బాలవర్ధనరావుని నిలబెట్టే ఆలోచనలో ఉంది అంటున్నారు. ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. అయితే అక్కడ ఆయనకు ఎలాంటి పదవీ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిగా ఉన్నారు. దాంతో ఆయన టీడీపీ గూటికి చేరుకోవడం ఖాయమని అంటున్నారు.

గన్నవరంలో మంచి పట్టున్న దాసరి కనుక టీడీపీ క్యాండిడేట్ అయితే వంశీకి సరైన పోటీ అవుతుంది అంటున్నారు. మొత్తానికి వంశీని ఈసారి అసెంబ్లీకి రానీయకుండా చేయాలని చంద్రబాబు లెవెల్ లోనే వ్యూహరచన సాగుతోంది. ఇక వంశీ పరిస్థితి ఎలా ఉంది అంటే వైసీపీ వారు ఆయన్ని సొంతం చేసుకోవడం లేదు. పైగా అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి. వంశీ మీద 2014లో పోటీ చేసి ఓడిన దుట్టా రామచంద్రరావుది ఒక వర్గం. ఇక 2019లో ఓడిన యార్లగడ్డ వెంకటరావుది మరో వర్గం.

ఈ ఇద్దరికీ జగన్ పదవులు ఇచ్చి సెట్ చేసి ఉంటే వంశీకి క్లియర్ కట్ గా వైసీపీలో అవకాశం ఉండేది. రేపటి రోజున వంశీకి టికెట్ ఇస్తే ఈ ఇద్దరూ కనీసం సహకరించే చాన్స్ లేదు అంటున్నారు. మొత్తానికి వంశీకి టికెట్ వైసీపీ ఇస్తుందా అన్నది కూడా మరో డౌట్. టికెట్ తెచ్చుకున్నా స్వపక్షంతో పాటు టీడీపీని కూడా ఒకేసారి నిలువరించి గెలుపు సాధించడం అంటే వంశీకి అతి పెద్ద రిస్క్ అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో ఆసక్తిని రేపే కీలక సీట్లలో గన్నవరం కూడా ఒకటి అని అంటున్నారు.