Begin typing your search above and press return to search.

వంశీకి వైసీపీ సెగ‌.. ఇన్ చార్జ్ గా ఆయ‌న వ‌ద్దంటూ లేఖ‌!

By:  Tupaki Desk   |   20 March 2022 10:30 AM GMT
వంశీకి వైసీపీ సెగ‌.. ఇన్ చార్జ్ గా ఆయ‌న వ‌ద్దంటూ లేఖ‌!
X
ఆయ‌న ఏవో ఆశ‌ల‌తో వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి..గెలుపున‌కు సాయం చేసిన టీడీపీని సై తం ప‌క్క‌న పెట్టి.. వైసీపీలోకి చేరిపోయారు. పైగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును సైతం తూల‌నాడారు. వైసీపీ మెప్పుకోసం అన‌రాని మాట‌లు కూడా అనేసి సారీ చెప్పారు. అయితే.. ఇంత త్యాగం చేసినా.. ఆయ‌న‌కు ఇప్పుడు అదే వైసీపీలో సెగ పుడుతోంది. నాయ‌కులు ఎవ‌రూ కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ప‌రిస్థితి లేదు. ఆయ‌నే కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ.

అస‌లు వంశీ.. వైసీపీలోకి రావ‌డం వెనుక మంత్రి కొడాలి నాని ప్రోద్బ‌లం ఒక్క‌టే ఉంది. కానీ, గ‌న్న‌వ‌రం లో ఉన్న వైసీపీ నాయ‌కులు.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు కానీ, మ‌రో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కానీ, వంశీ వైసీపీలోకి రావ‌డాన్ని స‌హించ‌లేదు. అంతేకాదు.. పలు సందర్భాల్లో వంశీ వర్సెస్ వెంకటరావు మద్దతు దారుల నిరసనలు చోటు చేసుకున్నాయి. అయితే, పార్టీ అధిష్టానం.. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ఇరు ప‌క్షాలు ఒకింత శాంతించాయి.

అయితే.. తాజాగా గన్నవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు వల్లభనేని వంశీకి ఇవ్వద్దంటూ.. గన్నవ రం వైసీపీ నాయ‌కులు కార్యకర్తల రూపంలో వంశీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి ఆ లేఖ పంపినట్లుగా వైరల్ అవుతోంది. పార్టీ పెట్టిన త‌ర్వాత తొమ్మిదేళ్ల కాలంలో పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని లేఖలో పేర్కొన్నారు. జగన్‌ను మరోసారి సీఎంను చేసుకుంటామని లేఖలో భ‌రోసా క‌ల్పించారు.

ఈ సంద‌ర్భంగా వంశీపై కొన్ని ఆరోప‌ణ‌లు కూడా చేశారు. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. వంశీ త‌మ‌పై అక్ర‌మ కేసులు పెట్టించార‌ని.. ఈ విష‌యంలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. నియోజకవర్గంలో వంశీ పెత్త‌నం ఎక్కువైంద‌ని.. ఫిర్యాదు చేశారు. అదేస‌మ‌యంలో వంశీ కాకుండా ఎవరిని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించినా తమకు సమ్మతమే అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు. నియోజకవర్గంలో తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా వంశీ అనుచరులకే స్థానిక పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా.. పార్టీ అభ్యర్ధి 30 వేల పైగా మెజార్టీతో విజయం సాధిస్తారని లేఖ‌లో ధీమా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ లేఖ‌పై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అంతేకాదు.. ఇష్ట‌ప‌డి పార్టీలో కి తెచ్చుకున్న వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం పార్టీలో చర్చకుదారితీసింది. మ‌రి ఈ లేఖ‌పై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.