Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిపై మ‌న‌దే త‌ప్పా... వైసీపీలో ఈ కొత్త డిస్క‌ర్ష‌న్ ఏంటి...!

By:  Tupaki Desk   |   6 March 2022 1:30 AM GMT
అమ‌రావ‌తిపై మ‌న‌దే త‌ప్పా... వైసీపీలో ఈ కొత్త డిస్క‌ర్ష‌న్ ఏంటి...!
X
రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. ముఖ్యంగా ఇదే గుంటూరు జిల్లాకు చెందిన నేత‌ల చుట్టూ.. నాయ‌కులు వేలు పెట్టి చూపిస్తున్నారు. `మ‌నోళ్లు స‌రిగా ఉండి ఉంటే..`` అంటూ.. గుస‌గుస‌లాడుతున్నారు. ``పార్టీలో విధాన‌ప‌ర మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్య‌త మాపై ఉంటుంది. మేం కాద‌నం.

అందుకే మూడు రాజ‌ధానుల విష‌యంలో.. అటు ఉత్త‌రాంధ్ర‌లోను, ఇటు సీమ‌లోనూ.. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు అనుకూలంగా.. ప్ర‌జ‌ల‌ను క‌దిలించేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం`` అని ఒక సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు.

మ‌రికొంద‌రు మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేశారు. ``మూడు రాజ‌ధానుల విష‌యాన్ని మేం సీరియ‌స్‌గానే తీసుకున్నాం. కానీ, రాజ‌ధాని ప్రాంతానికి చెందిన మా నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక్క‌డ రైతుల‌ను మెప్పించే కార్య‌క్ర‌మాలు చేసి ఉండాల్సింది. క‌నీసం.. వారితో దూకుడు గా కాకుండా.. వారిని మా దారిలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు చేసినాబాగుండేది.

అంతేకాదు.. వారితో ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగి.. వ్య‌వ‌హారం మొత్తాన్ని చెడ‌కొట్టారు. ఎందుకు అప్పుడు రెచ్చిపోయారో.. మాకు అర్ధం కావ‌డం లేదు. సీఎం జ‌గ‌న్ ఎవ‌రికీ.. రైతుల‌తో వివాదాలు పెట్టుకోవాల‌నికానీ, ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగాల‌ని కానీ, చెప్ప‌లేదు. `` అని అంటున్నారు.

దీనిని బ‌ట్టి.. క్షేత్ర‌స్థాయిలో మూడు రాజ‌ధానుల విష‌యాన్ని బ‌లంగా వినిపించ‌డంలో నాయ‌కులు విఫ‌ల మ‌య్యార‌నే వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు.. రాజ‌ధానిలో ఆందోళ‌న‌లు చేస్తున్న రైతుల‌ను స‌ర్దుబాటు చేయ‌డంలోనూ.. వారిని స్వాంతన ప‌ర‌చ‌డంలోనూ.. వైసీపీ నాయ‌కులు.. విఫ‌ల‌మ‌య్యార‌ని.. సొంత పార్టీ నేత‌లే అంటున్నారు. ఎంత‌సేపూ..రెచ్చ‌గొట్టే రీతిలో వ్య‌వ‌హ‌రించారే త‌ప్ప‌.. రైతులతో క‌లిసి.. మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా వారిని మెప్పించి ఉంటే.. ప‌రిస్థితి భిన్నంగా ఉండేద‌ని చెబుతున్నారు.

ఇది చేయ‌డం మానేసి.. ఎంత సేపూ.. తొడ‌గొట్టేందుకే ప్రాధాన్యం ఇచ్చి.. ఇప్పుడు పీక‌ల లోతు క‌ష్టాల్లో అంద‌రినీ ముంచేశార‌ని.. పెద‌వి విరుస్తున్నారు. ఇలాంటి నేత‌ల వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదైనా ప‌ని అప్ప‌గిస్తే.. ఇలానా చేసేది? అని అసంతృప్తి వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.