Begin typing your search above and press return to search.

రానున్న రోజుల్లో అమెరికాలో అంతమంది మరణిస్తారా?

By:  Tupaki Desk   |   28 March 2020 5:24 AM GMT
రానున్న రోజుల్లో అమెరికాలో అంతమంది మరణిస్తారా?
X
వినేందుకే వణుకు పుట్టిస్తోంది అమెరికాలోని కరోనా తీవ్రత. ఊహకు అందని రీతిలో.. అగ్రరాజ్యంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా.. ఇప్పుడా దేశానికి గుదిబండలా మారటమే కాదు.. అమెరికన్లను దారుణంగా దెబ్బ తీస్తుందని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో కొవిడ్ 19 పాజిటివ్ కేసులు ఏకంగా లక్ష దాటేశాయి. అధికారిక సమాచారం ప్రకారం ఒక్క అమెరికాలో 1,04,180 కేసులు నమోదు కాగా.. మరణాలు 1706గా చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 18 శాతం కేసులు అమెరికాలోనే కావటం గుండెలు అదిరేలా చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో అమెరికాలో భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం నాలుగు నెలల్లో లక్ష మంది వరకు కరోనా వైరస్ బారిన పడి మరణించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేసిన సర్వేలో తేల్చారు.

ఏప్రిల్ రెండో వారానికి వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య అధికంగా ఉంటుందని.. జూన్ లో మరణాల సంఖ్య తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. జూన్ లో ప్రతి రోజూ పది మందికి వరకూ మరణించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికి న్యూయార్క్ లో వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతుంటే.. కాలిఫోర్నియాలో నెమ్మదిగా సాగుతోంది. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో కూడా వేగంగా వ్యాప్తి చెందే వీలుందంటున్నారు.

మిగిలిన దేశాలకు భిన్నంగా అమెరికాలో కరోనా కారణంగా మరణిస్తున్న వారిలో 40 - 50 ఏళ్ల మధ్య వయస్కులు మరణించటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకిలా? అంటే.. అమెరికన్లలో చాలామంది వైరస్ కు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోకపోవటం.. చేతులు శుభ్రంగా కడుక్కోకపోవటం వల్లే ఇలాంటి దుస్థితి అని చెబుతున్నారు. మొత్తం కేసుల్లో సగం ఒక్క న్యూయార్క్ నగరంలోనే నమోదుకావటం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన అదుపు చేయకుంటే.. కరోనాకు అగ్రరాజ్యం భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదంటున్నారు.