Begin typing your search above and press return to search.

అర్జంటుగా ఢిల్లీకి జగన్...ఆసక్తికరమే...?

By:  Tupaki Desk   |   4 April 2022 5:29 AM GMT
అర్జంటుగా ఢిల్లీకి జగన్...ఆసక్తికరమే...?
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అర్జంటుగా ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు. ఈ నెల 5న సాయంత్రం ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. అదే విధంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఈ టూర్ లో జగన్ కలుస్తారు అని తెలుస్తోంది.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అయితే ఖరారు అయింది అని చెబుతున్నారు. ఇక ఈ పర్యటనలో జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిసే వీలు ఉందని అంటున్నారు, కానీ ఇప్పటిదాకా ఆయన అపాయింట్మెంట్ అయితే దొరకలేదు అని అంటున్నారు.

అది కూడా కుదిరితే అమిత్ షా తో జగన్ భేటీ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంత అర్జంటుగా జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు పెట్టుకున్నారు అన్నది మాత్రం చర్చగా ఉంది. జగన్ ఢిల్లీ టూర్ గురించి ఒక రోజు ముందుగానే వార్త బయటకు వచ్చింది.

అయితే ఇది సాధారణమైన పర్యటనే అని అంటున్నారు. ముఖ్యమంత్రి చాలా కాలంగా ఢిల్లీ వెళ్లాలి అని అనుకుంటున్నారు, కానీ వీలు పడలేదని, ఇపుడు ప్రధాని తో అపాయింట్మెంట్ లభించింది కాబట్టి వెళ్తున్నారు అని అంటున్నారు.

అయితే మూడు రాజధానుల విషయంలో అడుగు ముందుకు వేయలేకపోవడం, అమరావతి మీద హై కోర్టు తుది తీర్పు వెలువరించడంతో జగన్ ఢిల్లీ టూర్ కి ప్రాముఖ్యత ఏర్పడింది. అలాగే కర్నూల్ లో న్యాయ రాజధాని పెడతామని ఈ మధ్యనే మంత్రి బుగ్గన చెప్పారు.

మూడు రాజధానులు తమ విధానం అని ప్రభుత్వం అంటోంది. ఇక అమరావతిని అభివృద్ధి చేయడానికి లక్షల కోట్లు అవసరం అవుతాయని లెక్కలు చెబుతోంది. కొత్తగా ప్రభుత్వం దీని మీద అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తిని రేపుతోంది.

ఇక మరో వైపు చూస్తే రాజకీయంగా ఏపీలో పరిణామాలు మారుతున్నాయి. బీజేపీని కూడా టీడీపీ జట్టులోకి లాగేందుకు జనసేనాని పవన్ యత్నిస్తున్నారు అని అంటున్నారు. దాంతో రాజకీయంగా ఈ మూడు పార్టీలు కలవకూడదు అన్నది వైసీపీ పెద్దల ఆలోచన. దాని కోసం ఆ పార్టీ ఏం చేయాలో అది చేస్తుంది అని అంటున్నారు.

ఇక బీజేపీ పెద్దల మదిలో ఏముంది. ఏపీలో టీడీపీతో బీజేపీ స్నేహానికి కేంద్ర పెద్దలు ఓకేనా కాదా అన్నది కూడా జగన్ ఢిల్లీ టూర్ లో తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది అంటున్నారు. ఇక ఈ మధ్యనే బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలలో నాలుగింటిని గెలుచుకుని హుషార్ గా ఉంది. అలాగే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు మూడు నెలల వ్యవధిలో ఉన్నాయి. దాంతో బీజేపీతో వైసీపీ ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద ఈ భేటీలో ఒక స్పష్టత వచ్చే వీలుంది అంటున్నారు.

వీటితో పాటు ఏపీలో ఉన్న ఆర్ధిక సమస్యలు, పోలవరం ప్రాజెక్టునకు నిధులు కోరడంతో పాటు, ఇతర సమస్యల మీద చర్చలు ఉంటాయ‌ని అంటున్నారు. ఏది ఏమైనా బయటకు సడెన్ గా జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు అని అంటున్నా ఈ టూర్ గురించి చాలా ముందుగానే నిర్ణయించుకున్నారు అని అర్ధమవుతోంది. చూడాలి మరి జగన్ ఢిల్లీ టూర్ లో ఏ రకమైన సంచలనాలు నమోదు అవుతాయో.