Begin typing your search above and press return to search.

ఒయ్యారి గోదారమ్మా...ఒడిసి పట్టేస్తామమ్మా....

By:  Tupaki Desk   |   13 March 2022 12:30 PM GMT
ఒయ్యారి గోదారమ్మా...ఒడిసి పట్టేస్తామమ్మా....
X
గోదావరి వయ్యారాలను చెప్పాలంటే కవులే కానక్కరలేదు. రెండు కళ్ళ కెమెరాతో చూస్తే మదిలో ఎన్నో ఆలోచనలు మెదులుతాయి. అవి అక్షర రూపమలో చెప్పడానికి కూడా అలవికాని అనుభూతిని ఇస్తాయి. నిజానికి చూస్తే ఎక్కడో నాసిక్ లో పుట్టిన గోదావరమ్మ అలా వడివడిగా సాగుతూ సాగరంలో కలుస్తుంది.

గొప్ప జీవనది గోదావరి. అలాంటి గోదావరి జలాలను ఒడిసి పట్టుకుంటే బీడు భూములు పచ్చని చీర కట్టుకుంటాయి. మానవ జీవితాలు పచ్చగా మారుతాయి. అందుకే పోలవరాన్ని ఏపీకే అద్భుతమైన వరంగా ముందుకు తెచ్చారు. మొత్తానికి ఎనిమిది దశాబ్దాల తరువాత పోలవరం కల ఇపుడు ఎంతో కొంత సాకారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

పోలవరం పనులు చకచకా సాగుతున్నాయి. తాజాగా అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్ట్ స్పిల్ వేకి మొత్తం 48 రేడియల్ గేట్ల అమరిక పూర్తి చేసినట్లుగా అధికారులు తెలియచేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం 2020 డిసెంబర్ లో మొదలింది. గత ఏడాది వరదల సీజన్ నాటికే 42 గేట్లను పూర్తి చేశారు. మిగిలిన ఆరింటినీ తాజాగా పూర్తి చేయడంతో చాలా కీలకమైన పనులు పూర్తి అయ్యాయని అంటున్నారు.

ఇక ఈ గేట్లకు పెట్టాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకుగానూ 84 సిలిండర్లను ఇప్పటికే అమర్చారు. మరో ఆరు గేట్లకు 12 సిలిండర్లను త్వరలోనే పెడితే కనుక ఈ గేట్లు మొత్తం పూర్తి అయినట్లే. ఈ గేట్లను ఎత్తడానికీ దించడానికీ 24 పవర్ ఫాసెట్ లను కూడా అమర్చారు. ఇలా టోటల్ గా పోలవరం ప్రాజెక్టునకు పెట్టిన 48 గేట్లను ఇక మీదట ఆపరేట్ చేసుకోవచ్చు.

అదే విధంగా చూస్తే 10 రివర్ స్లూయిజ్ గేట్ల అమరిక కూడా పూర్తయింది. వాటికి 10 పవర్ ఫాసెట్లను పెట్టారు. ఇప్పటికే కాంక్రీట్ పనులూ పూర్తయ్యాయి. మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు 97 శాతం దాకా అయ్యాయి. దీని వల్ల వరదల సమయంలో గోదావరి నీరు పెద్ద ఎత్తున దిగువకు వచ్చినపుడు గేట్లను మూసేసి ఆ నీటిని నిల్వ చేసుకోవచ్చు. మొత్తం గోదావరి నీరు అంతా వ్యర్ధంగా ఉప్పు సముద్రం పాలు అవుతోంది అని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. అలా స్టోరేజ్ చేసుకుని అవసరాలకు తగిన విధంగా వాడుకోవచ్చు.

అయితే పూర్తి స్థాయిలో స్టోరేజ్ చేయాలీ అంటే ఇంకా సమీప నిర్వాసిత ప్రాంతాలలో చాలా పనులు చేపట్టాలి. అదే సమయంలో నిర్వాసితుల సమస్యలు తీర్చి వారికి మంచి కాలనీలు పూర్తిగా నిర్మించి ఇస్తేనే తప్ప నూటికి నూరు శాతం గోదావరి నీరుని ఒడిసిపట్టడం జరిగే పని కాదు. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఈ మాత్రం ముందడుగు పడడం కూడా చాలా మంచి పరిణామమే అంటున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ ఏనాటికి పూర్తి అవుతుందా గోదావరమ్మ పరుగులకు కళ్ళెం వేసే పరిస్థితి ఏ రోజుకు అయినా ఉంటుందా అన్ని కొన్ని దశాబ్దాల పాటు మేధావుల నుంచి సామాన్యుల వరకూ అంతా ఎదురుచూసిన వాతావరణంలో తాజా పరిణామాలు మాత్రం ఒక విధమైన ఆనందాన్ని కలిగిస్తాయని గట్టిగా చెప్పవచ్చు.