Begin typing your search above and press return to search.

కాబోయే మంత్రులకు కంగ్రాట్స్...లిస్ట్ లీక్...?

By:  Tupaki Desk   |   16 March 2022 9:44 AM GMT
కాబోయే మంత్రులకు కంగ్రాట్స్...లిస్ట్ లీక్...?
X
జగన్ మదిలో కొత్త మంత్రులు ఉన్నారు. ఆయన రివీల్ చేసేంతవరకూ కూడా వారి పేర్లు ఎవరికీ తెలియవు. అయితే వైసీపీలో మాత్రం ఎమ్మెల్యేల సందడి అలా ఇలా లేదు. కాబోయే మంత్రులు ఎవరో తమ‌కు ఉన్న సమాచారంతో వారు బాగానే పసిగట్టేస్తున్నారు. ఎవరైతే జోష్ గా హుషారుగా ఉన్నారో వారిని పట్టుకుని మరీ కంగ్రాట్స్ అంటున్నారు.

అలా అందరికీ కాదు, ఆయా జిల్లాల్లో సమీకరణలను చూసుకుంటూ బేరీజు వేసుకుంటూ తమదైన విశ్లేషణతో వీరికి చాన్స్ కచ్చితంగా ఉంటుంది అని లెక్కలేస్తున్నారు. అలా ముగ్గురు కాబోయే మంత్రుల విషయాని పసిగట్టేశారు. దాంతో వారికి మిగిలినఎమ్మెల్యేలు అందరూ కలసి కంగ్రాట్స్ చెప్పడం కూడా స్టార్ట్ చేసేశారు.

అసెంబ్లీ లాబీల్లో అలా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే వారి వద్దకు వచ్చిన మిగిలిన ఎమ్మెల్యేలు వారికి అభినందనలు చెబుతూ మీరే రేపటి రోజున మంత్రులు అంటూ కరచాలనం చేసేశారు. ఇంతకీ వారు ఎవరూ అంటే క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి. అలాగే విశాఖ రూరల్ జిల్లాకు చెందిన గుడివాడ అమరనాధ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దాడిశెట్టి రాజా.

ఈ ముగ్గురికీ జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా వీరికి గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయి. దాంతో పాటు బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్నాయి. దాంతో వీరే కాబోయే మంత్రులు అని డిసైడ్ అయిపోయారన్న మాట. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కురసాల కన్నబాబు ప్లేస్ లో వచ్చేది దాడిశెట్టి రాజా అని ముందు నుంచి వినిపిస్తోంది. బలమైన కాపు సామాజికవర్గం, తునిలో సీనియర్ టీడీపీ నేత యనమల రామక్రిష్ణుడు ఫ్యామిలీని రెండు సార్లు ఓడించి వైసీపీకి బలమైన నేతగా ఉన్నారు.

ఇక విశాఖకు చెందిన గుడివాడ అమరానాధ్ కి రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి గురునాధరావు కూడా అప్పట్లో మంత్రిగా చేశారు. వైసీపీలో యువకుడు, దూకుడు కలిగిన నేతగా అమరనాధ్ ఉన్నారు. దాంతో పాటు కాపు సామాజికవర్గం ఆయనకు కలసి వచ్చే అంశం. సో గుడివాడ దశ తిరిగింది అంటున్నారు.

ఇక క్రిష్ణా జిల్లాలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్ధసారధికి మంత్రి పదవి అన్నది కొత్త కాదు, వెనకటి సర్కార్ లో ఆయన మినిస్టర్ గా పనిచేశారు. ఇక వైసీపీలో సీనియర్ గా ఉన్నా గతంలో పదవి దక్కలేదు. దాంతో ఈసారి తప్పక జగన్ అవకాశం ఇస్తారని చెబుతున్నారు. సో మొత్తం క్యాబినేట్ లో ముగ్గురు మంత్రుల లిస్ట్ అయితే ఇలా బయటకు వచ్చేసింది అన్న మాట. మిగిలిన వారి వివరాలు కూడా ఈ అసెంబ్లీ సెషన్ ముగిసేలోగా వైసీపీ ఎమ్మెల్యేలే చెప్పేస్తారేమో అంటున్నారు. చూడాలి మరి.