Begin typing your search above and press return to search.

బాబు ఎన్నికల ప్రచారం.. ఆ పాయింట్ నవ్వుల పాలే!

By:  Tupaki Desk   |   17 March 2019 12:33 PM GMT
బాబు ఎన్నికల ప్రచారం.. ఆ పాయింట్ నవ్వుల పాలే!
X
గత ఐదేళ్లలో ఏం చేశామో వివరించి ఎన్నికల ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేస్తున్నారని స్పష్టం అవుతోంది. ఎంతసేపూ .. జగన్ గెలిస్తే పరిస్థితి అలా ఉంటుంది, జగన్ గెలిస్తే ఇలా ఉంటుంది.. అంటూ జోస్యగాడిలా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక మోడీ, కేసీఆర్ ల పేర్లు కూడా బాబు ప్రచార పర్వంలో ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రజలకు పనికి వచ్చే పాయింట్లు ఇవి కావు. ఈ విషయాన్ని అయితే ఎవరైనా చెబుతారు.

బాబుకు ప్రజలు ఐదేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. వారి కోసం తను ఏం చేసినట్టో బాబు సూటిగా స్పష్టంగా చెప్పుకుని ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చిప్పుడు. అంతే కానీ.. ఇలా బూచిలను చూపెట్టి ప్రచారం చేసుకోవడం అనేది బాబుకు తగదు. అది వర్కవుట్ అయ్యే అంశం కాదు కూడా!

ఐదేళ్ల విజయాల గురించి చెప్పమంటే.. ప్రజలకు అర్థం కాని విషయాలనే బాబు చెబుతూ ఉన్నారు. సంక్షేమంలో దేశంలో నంబర్ వన్ అని చెప్పుకొంటున్నారు. ఈ నంబర్ల గోల ఏమిటో మరి. ఇవి ప్రజలకు అర్థం అయ్యే విషయాలు కావు. అందుకే బాబు వాటిని ప్రస్తావిస్తూ ఉన్నారు.

అంతేగాక మరో విషయాన్ని బాబు ప్రస్తావిస్తున్నారు. అదేమిటంటే.. రుణమాపీ చేసినట్టుగా, డ్వాక్రా మహిళలకు తను ఒక పెద్దన్నగా వ్యవహరించినట్టుగా బాబు చెప్పుకుంటున్నారు. ఇదీ అసలు కామెడీ. అసలే రుణమాఫీ విషయంలో రైతులు కాక మీదున్నారు. గత ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన ఆయుధం రుణమాఫీ హామీ. దాని అమలు మాత్రం ప్రహసనంగా సాగింది. అధికారంలోకి వస్తే .. తాకట్టులోని బంగారాన్ని కూడా విడిపించడం అనే హామీని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాకా.. రుణమాఫీ కి అర్హుల జాబితా అంటూ ఒకటి తయారు చేసింది. ఈ ‘అర్హులు’ అనే మాటను ఎన్నికల ముందు చెప్పలేదు.

ఇక అర్హులుగా తేలిన వారికి అయినా మాఫీ చేశారా.. అంటే, అదీ లేదు! విడతల వారీగా అన్నారు. విడతల వారీగా ఇచ్చే సొమ్ములు వడ్డీలకు సరిపోవడం లేదని రైతులు వాపోతూ ఉన్నారు. అలా అయినా ఇచ్చింది మూడు విడతలే. నాలుగు, ఐదో విడతల సొమ్ము ఇవ్వనే లేదు! ఎన్నికల ముందు అయినా బాబు ఆ సొమ్ములు రిలీజ్ చేస్తారని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే వారికి బాబు మొండి చేయి చూపారు. అలాంటిది ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. రుణమాఫీ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొంటూ ఉండటం విశేషం. ఈ మాటను వింటున్న రైతులు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు!