Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీలో ఆధిపత్య పోరు: ఫైట్ కు కారణమేంటి?

By:  Tupaki Desk   |   22 Feb 2020 8:30 AM GMT
వైఎస్సార్సీపీలో ఆధిపత్య పోరు: ఫైట్ కు కారణమేంటి?
X
గుంటూరు జిల్లాలోని అధికార పార్టీలో రాజకీయాలు హీటెక్కాయి. ఎంపీ - ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయికి చేరాయి. దీంతో చిలకలూరిపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. సొంత పార్టీకి చెందిన ఎంపీ - ఎమ్మెల్యేలే పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి ఎందుకు చేరాయి? ఒక్కసారిగా పరిణామాలు మారడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అసలు చిలకలూరి పేటలో ఏం జరుగుతోంది? అని ప్రశ్నలు మొదలయ్యాయి.

చిలుకలూరిపేటలో నివసిస్తున్న బైరాకృష్ణ ఇంటికి నరసరావుపేట వైఎస్సార్ సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు బుధవారం రాత్రి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విడదల రజనీ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీని అడ్డుకున్నారు. దీనికి గతంలో జరిగిన పరిణామాలే కారణం. ఎన్నికల సమయంలో నాయకుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డికి - రజనీకి విభేదాలు ఉన్నాయి. ఆ సమయంలో రాజశేఖర్‌ ప్లెక్సీలను రజనీ వర్గం చించేశారు.

మర్రి రాజశేఖర్‌ కు లావు కృష్ణదేవరాయలు సన్నిహితంగా ఉండడంతో ఇప్పుడు రజనీ వర్గం ఎంపీ వైఖరిని తప్పుబడుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఓ సామాజిక వర్గం నేతలు ఒక్కటై కుట్రలు చేస్తున్నారని రజనీ వర్గం భావిస్తోంది. వీటిన్నిటి నేపథ్యంలో ఎంపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎంపీ వర్గంపై దాడి జరగ్గా.. తాజాగా చిలకలూరిపేట ఎమ్మెల్యే మరది గోపీనాథ్ - భర్త కారుపై దాడులు జరిగాయి. ఎమ్మెల్యేకి చెందిన ప్రభను కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ దాడి జరగ్గా కారు ధ్వంసమవడంతో పాటు ఎమ్మెల్యే మరిదికి గాయాలయ్యాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. అయితే ఈ దాడి మాజీమంత్రి ప్రతిపాటి పుల్లారావు చేయించారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తుండగా.. తమ సహనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని తమను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఆ దాడులు తాము చేయించలేదని - వైసీపీ ఎంపీ - ఎమ్మెల్యే రజనీ మధ్య ఉన్న విభేదాలే కారణమని టీడీపీ సీనియర్ నాయకుడు - మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెబుతున్నారు. వాళ్ల ఆధిపత్య పోరులో జరుగుతున్న దాడులను టీడీపీ నేతలపై రుద్దడం సమంజసం కాదని హితవు పలికారు. మొత్తానికి చిలకలూరిపేట వైసీపీలో ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార పార్టీలో ఈ వర్గపోరు ఎక్కడిదాక దారి తీస్తుందో తెలియడం లేదు.