Begin typing your search above and press return to search.

ఎన్డీయేలోకి టీడీపీ ప్రచారం.. తేల్చేసిన లక్ష్మణ్

By:  Tupaki Desk   |   1 Sep 2022 10:15 AM GMT
ఎన్డీయేలోకి టీడీపీ ప్రచారం.. తేల్చేసిన లక్ష్మణ్
X
మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో కొన్ని ప్రచారాలు ఏ మాత్రం మంచివి కావు. కొన్ని ప్రచారాలు మొదలైనప్పుడు పెద్దగా పట్టించుకోకుంటే.. అవి పెరిగి పెరిగి పెద్దవి అయిపోతాయి. ఆ తర్వాత ఎంత కొట్టుకున్నా సరే.. వాటి కారణంగా జరిగే డ్యామేజ్ ను పూడ్చలేని పరిస్థితి.

ఇప్పుడు అలాంటి ప్రచారం ఒకటి తెలుగు రాష్ట్రాల్లో నడుస్తోంది. రెండు.. మూడు రోజుల నుంచి ఎన్డీయేలోకి టీడీపీ చేరుతుందని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్నిచూస్తేనే.. ఇదేదో స్కీమ్ అన్నట్లు ఉంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అధినాయకత్వం పావులు కదుపుతున్న వేళ.. ఈ తరహా ప్రచారం కొత్త కన్ఫ్యూజన్ తో పాటు.. పార్టీకి భారీ నష్టం జరిగే వీలుంది. ఈ విషయాన్ని గుర్తించినట్లున్నారు బీజేపీ అగ్రనేతలు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చేశారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఎన్డీయేలోకి టీడీపీ అన్న విషయంపై ఆయన్ను ప్రశ్నించగా.. అది ఉత్త ప్రచారమే తప్పించి మరేమీ లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్న లక్ష్మణ్.. ఇప్పటివరకు జరిగిన ప్రచారాలకు చెక్ పెట్టేశారు. బీజేపీలో అత్యున్నత పార్లమెంటరీ బోర్డులో సభ్యుడైన లక్ష్మణ్ నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్య చూస్తే.. ఎన్డీయేలోకి టీడీపీ అన్నది ఉత్త ప్రచారమే తప్పించి.. ఇప్పట్లో ఈ ఇష్యూ ముందుకు వెళ్లే అవకాశం లేదని చెప్పక తప్పదు.

ఎన్డీయేలోకి టీడీపీ లాంటి ఆలోచన ఉంటే మీడియాకు తెలియజేస్తామని చెప్పిన ఆయన.. తెలంగాణలో తాము ఒక్కరిమే పోటీ చేస్తామని.. ఏపీలో మాత్రం జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్లు చెప్పారు.దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా లక్ష్మణ్ వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని చెప్పారు.

దేశ వ్యాప్తంగా బీజేపీ బలపడుతోందని.. తెలంగాణలోనూ పార్టీ బలోపేతం అవుతున్నట్లు చెప్పిన ఆయన.. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలిచే దశకు చేరుకుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లుగా లక్ష్మణ్ చెప్పటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.