Begin typing your search above and press return to search.

లక్ష్మణ్ ధీమా... ఇద్దరు చంద్రులకు బొమ్మేనట

By:  Tupaki Desk   |   11 April 2019 4:49 PM GMT
లక్ష్మణ్ ధీమా... ఇద్దరు చంద్రులకు బొమ్మేనట
X
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికలు ముగిసిపోయాయి. నేటి ఉదయం ప్రారంభమైన పోలింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగిసిపోయింది. ఇక ఎన్నికల ఫలితాలు విడుదల కావడమే మిగిలి ఉంది. మే 23న జరిగే కౌంటింగ్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు బరిలో నిలిచిన పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అంటే... మే 23 వరకు ఎవరిది గెలుపో చెప్పడం సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలు - ఆయా పార్టీల నేతలు అప్పటిదాకా నోరు మూసుకుని కూర్చోరు కదా. తమదే గెలుపు అంటే.... కాదు తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తారు కదా.

అలాంటి ధీమానే వ్యక్తం చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్... ఆ ధీమాను పీక్స్ కు తీసుకుపోయారని చెప్పాలి. ఎన్నికల్లో కీలక ఘట్టం అయిన పోలింగ్ ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన లక్ష్మణ్... ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఊహించిన దానికన్నా అధికంగా సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తాము అంచనా వేసిన దానికన్నా కూడా అధిక సీట్లను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక అంతటితోనే ఆగని లక్ష్మణ్... ఫలితాల తర్వాతి పరిస్థితిని కూడా ఇప్పుడే చెప్పేశారు. టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు కూడా ఈ ఎన్నికలు గట్టిగానే బుద్ధి చెప్పనున్నాయని ఆయన జోస్యం చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఇద్దరు చంద్రులకు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో పోలింగ్ శాతం పడిపోవడానికి కారణాలను చెప్పిన ఆయన... తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకతే ఇందుకు కారణమని కూడా ఆయన రూలింగ్ ఇచ్చేశారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ కనుమరుగు కానుందని జోస్యం చెప్పిన లక్ష్మణ్... ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీలో చేరతారని కూడా చెప్పుకొచ్చారు. పలితంగా ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మాత్రమే మిగులుతామని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇక చివరగా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కూడా లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.