Begin typing your search above and press return to search.

బియ్యం బొక్కుడులో నేత‌లు బిజీ.. అధికారులు య‌మా బిజీ!

By:  Tupaki Desk   |   17 Sep 2020 12:30 PM GMT
బియ్యం బొక్కుడులో నేత‌లు బిజీ.. అధికారులు య‌మా బిజీ!
X
రాష్ట్రంలో అధికార పార్టీ నేత‌ల దూకుడు ఓ రేంజ్‌లో సాగుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌రకు ఇసుక మాఫియా తీవ్ర‌స్థాయిలో చెల‌రేగుతోంద‌ని భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంలో నేత‌ల దూకుడుతో అటు పార్టీకి, ఇటు ప్ర‌భుత్వానికి కూడా ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదురయ్యాయి. ఇక‌, కొన్నాళ్లుగా మ‌ద్యం అక్ర‌మ ర‌వాణా భారీ ఎత్తున సాగుతున్న విష‌యంలోనూ అధికార పార్టీ నేత‌ల పేర్లు వినిపించాయి. అనేక జిల్లాల్లో లారీల కొద్దీ మ‌ద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ప‌ట్టుకున్నారు. ఈ ప‌రిణామాలు.. ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారాయి.

ఇక‌, ఇప్పుడు రేష‌న్ బియ్యాన్ని అడ్డ‌గోలుగా బొక్కేస్తున్న వ్య‌వ‌హారం మ‌రింత‌గా కాక రేపుతోంది. రేష‌న్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌లిస్తున్న మాఫియాలో అధికార పార్టీ నాయ‌కుల పేర్లు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఈ మాఫియాలో కొంద‌రు అధికారులు కూడా వేలు పెడుతున్నార‌ని, దీంతో దొరికితే దొంగ‌లు.. లేక‌పోతే..దొర‌లు అనే త‌ర‌హాలో ఈ వ్య‌వ‌హారం సాగిపోతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల క‌ర్నూలులో అధికార పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున రేష‌న్ బియ్యాన్ని త‌ర‌లించేసిన విష‌యాన్ని సాక్షాత్తూ డీఎస్పీనే వివ‌రించ‌డం సంచ‌ల‌నం రేపింది.

ఒక్క క‌ర్నూలులోనే కాదు.. గుంటూరు, ప్ర‌కాశం, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ రేష‌న్ బియ్యాన్ని అధికార పార్టీ నేత‌లు, అధికారులు కుమ్మ‌క్క‌యి.. బొక్కేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి. ప్ర‌భుత్వం నుంచి పేద‌ల‌కు అందాల్సిన రేష‌న్ బియ్యాన్ని.. బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌లించి.. అక్క‌డ నుంచి రైస్ మిల్ల‌ర్ల‌కు అమ్ముతున్నారు. వీరు అదే బియ్యాన్ని పాలిష్ ప‌ట్టించి తిరిగి స‌న్న‌బియ్యంగా బ‌హిరంగ మార్కెట్‌లోకి చేర్చి.. కోట్లు గ‌డిస్తున్నారు. నిజానికి ఇది చాలా పెద్ద మాఫియా అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిలో అధికారుల పాత్ర నుంచి.. రేష‌న్ డీల‌ర్ల ప్ర‌మేయం వ‌ర‌కు ఉంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

అయితే, కొన్ని జిల్లాల్లో అధికారులు ఈ మాఫియాకు బ్రేకులు వేస్తున్నా... ఎక్క‌డో ఎవ‌రి నుంచో ఫిర్యాదులు అందిన‌ప్పుడు మాత్ర‌మే త‌నిఖీలు చేసో.. మ‌రో రూపంలో ఈ అక్ర‌మాల‌ను అరిక‌డుతున్నారు. లేక‌పోతే.. ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లాలో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు .. త‌నిఖీలు చేసిన‌ప్పుడు భారీ ఎత్తున రేష‌న్ బియ్యాన్ని నిల్వ‌లు చేసిన వ్యాపారుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇలా అడ‌పాద‌డ‌పా చ‌ర్య‌లు తీసుకుంటున్నారే .. త‌ప్ప వాస్త‌వానికి క్షేత్ర‌స్థాయిలో ఉన్న మాఫియాపై మాత్రం దృష్టి పెట్ట‌లేక పోతున్నారు. ఈ ప‌రిణామాలు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా.. నాయ‌కులు వ్య‌క్తిగ‌త నియంత్ర‌ణ పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.