Begin typing your search above and press return to search.

క్యాపిటల్ భవనంలో ఆ 4 గంటలు.. హాలీవుడ్ మూవీని తలపించింది

By:  Tupaki Desk   |   7 Jan 2021 11:05 AM GMT
క్యాపిటల్ భవనంలో ఆ 4 గంటలు.. హాలీవుడ్ మూవీని తలపించింది
X
ప్రజాస్వామ్యానికి కేరాఫ్ అడ్రస్ గా.. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తూ.. ఏదైనా దేశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే ధిలాసాగా తీర్పులు ఇచ్చే అమెరికాకు ఏమైంది? హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్లు.. అమెరికా కాంగ్రెస్ సభ్యులకు ఎదురుకావటం ఏమిటి? ప్రపంచ దేశాల్ని ప్రభావితం చేసే అమెరికా కాంగ్రెస్ లోని నేతలు భయం గుప్పిట గజగజ వణికిపోయారా? నాలుగు గంటల పాటు నరకాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాదు.. ప్రాణాలతో బయటపడతామా? అన్న భయంతో ఉండిపోయారా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. ఒకదశలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకొస్తున్న వేళ.. బయట ఉన్న భద్రతా సిబ్బంది చేతులు ఎత్తేయటంతో కనివిని ఎరగని వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.

ట్రంప్ పార్టీ జెండాలు.. అమెరికన్ జెండాల్ని చేతబూని క్యాపిటల్ భవనానికి చేరుకున్న ఆందోళనకారులు చూస్తుండగానే చీమలదండుగా మారిపోయారు. ఒక్కసారిగా పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటేసి.. గోడలు దూకేసి.. భవనాల్ని ఎక్కేస్తూ.. ఆవేశంగా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన వారి తీరు అమెరికన్ భద్రతా దళాలకు ముచ్చమటలు పోసేలా చేసింది. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికి వారు వెనక్కి తగ్గకపోవటంతో.. కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మరణించారు.
నాలుగు గంటల పాటు సాగిన హైడ్రామాలో బయట ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటే.. బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు వీలుగా సమావేశమైన అమెరికన్ కాంగ్రెస్ లోపలి పరిస్థితి ఎలా ఉందన్న విషయంలోకి వెళితే.. లోపలున్న సభ్యులు.. బయట చోటు చేసుకుంటున్న అసాధారణ పరిస్థితులకు షాక్ తిన్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఉభయ సభల సభ్యుల్ని ఆత్మరక్షణ కోసం భూగర్భ సొరంగంలో దాక్కోవటం గమనార్హం.

ఇలాంటి పరిస్థితి తమ జీవితంలో ఎదురుచూస్తామని కాంగ్రెస్ సభ్యులు ఎప్పుడు ఊహించి ఉండరేమో? అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో క్యాపిటల్ భవనంలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సమావేశమయ్యారు. అప్పటికే ట్రంప్ మద్దతు దారులు వందలాదిగా చేరుకున్నారు. అప్పటివరకు బాగానే ఉన్న వారు ఒక్కసారిగా క్యాపిటల్ భవనంలోకి దూసుకురావటమేకాదు.. తూర్పున ఉన్న గేటు వరకు వచ్చేశారు. దీంతో ప్రతినిధుల ఛాంబర్ లోని భద్రతా సిబ్బంది.. ఆందోళన కారులు లోపలకు వస్తున్నట్లుగా హెచ్చరికలుజారీ చేశారు.

దీంతో.. ఎగువ సభను నిర్వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఛాంబర్ నుంచి వెళలిపోగా.. అదే సమయంలో ప్రతినిధుల సభ.. సెనెట్ ను కలిపే రొటుండా మెట్ల దాకా ఆందోళనకారులు చేరుకున్నారు. పోలీసుల్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నా.. గోడలు ఎక్కుతూ లోపలకు ప్రవేశించారు. దీంతో ఉభయ సభల గదులకు తాళాలు వేశారు.రొటుండా ప్రాంగణంలో పరిస్థితి చేజారిపోవటంతో భద్రతా సిబ్బంది భాష్పవాయువుల్ని ప్రయోగించారు. అయినప్పటికీ తగ్గని వారు ఛాంబర్ లోపలకు వచ్చే ప్రయత్నం చేయగా..కాల్పులుజరిపారు.

ఇక.. కాంగ్రెస్ లోని సభ్యులు సీట్ల కింద దాక్కోవటంతో పాటు.. పాక్కుంటూ భూగర్భ సొరంగంలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. పరిస్థితులు అంతకంతకూ విషమించటంతో ఉభయ సభల్లోని సభ్యుల్ని.. ఒక వరుసలో ఛాంబర్ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. దీంతో.. వారంతా పై అంతస్తుకు పరుగులు తీశారు. మరోవైపు నుంచి కిందకు దిగి.. భూగర్భ సొరంగం ద్వారా సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఆందోళన.. సాయంత్రం ఆరు గంటల సమయానికి (అమెరికా కాలమానం ప్రకారం) పరిస్థితి అదుపులోకి వచ్చింది. క్యాపిటల్ భవనం పూర్తిగా సురక్షితం అని ప్రకటించిన తర్వాత రాత్రి వేళ సమావేశమైన ఉభయ సభలు.. బైడెన్ ఎన్నికను ధ్రువీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భవనం బయట మాత్రం ట్రంప్ మద్దతుదారులు మాత్రం నినాదాలు చేస్తుండటం గమనార్హం. ఈ సందర్భంగా సభలో ఉన్నరిపబ్లికన్.. డెమొక్రాటిక్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మీ నాయకుడు ట్రంప్ కు ఫోన్ చేసి.. పరిస్థితిని సద్దుమణిగేలా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. ఇలాంటి అసాధారణ పరిస్థితులు అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు.