Begin typing your search above and press return to search.

య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ లో నేత‌ల సంద‌డి

By:  Tupaki Desk   |   27 Jun 2022 9:30 AM GMT
య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ లో నేత‌ల సంద‌డి
X
జూలై 18న జ‌ర‌గ‌నున్న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జూన్ 27న‌, సోమ‌వారం ఆయ‌న త‌న నామినేష‌న్ ను దాఖ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాగా.. సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర‌ నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తృణ‌మూల్ కాంగ్రెస్, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), వామపక్ష నేతలు, పలు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

కాగా.. అంతకుముందు పార్లమెంట్‌లో ప్ర‌త‌పక్ష నేతలంతా భేటీ అయి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత యశ్వంత్‌ సిన్హాతో నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

నామినేష‌న్ వేసిన త‌ర్వాత ప్ర‌తిప‌క్ష నేత‌లంతా ఉమ్మ‌డి మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ఖ‌రారు చేస్తార‌ని అంటున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే కేంద్రంలోని అధికార ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున ద్రౌప‌ది ముర్ము రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు థ‌ర్డ్ ఫ్రంట్, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ హ‌డావుడి చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని టీఆర్ఎస్ అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా య‌శ్వంత్ నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌రుకావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. మొత్తం 22 పార్టీలు య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయ‌ని తెలుస్తోంది.

ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ఇప్ప‌టికే బీజేపీ భాగ‌స్వామ ప‌క్షాలే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్, బిజూ జ‌న‌తాద‌ళ్ తదిత‌ర పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ నేప‌థ్యంలో ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థికి ఎల‌క్టోర‌ల్ కాలేజీలో 60 శాతం ఓట్లు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ప్ర‌తిప‌క్షాల బ‌లం 40 శాతానికే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము విజ‌యం సాధించ‌డం సులువేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే తొలి గిరిజ‌న రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్ము రికార్డు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.